వక్ఫ్ భూములపై ‘పచ్చ’ గద్దల కన్ను!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కోట్ల విలువైన వక్ఫ్ భూములపై ‘పచ్చ’ గద్దలు వాలిపోయాయి. వాటిని హస్త గతం చేసుకొనేందుకు భారీ కుట్రకు తెరలేపాయి. పెనమలూరు, తాడిగడప మునిసిపాలిటీ, పెద్దపులిపాక పంచాయతీ పరిధిలో వక్ఫ్ బోర్డుకు చెందిన కోట్ల విలువైన కొండపల్లి ఖాజీ సర్వీసు ఇనాం భూములు ఉన్నాయి. అయితే ఈ భూములన్నీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ బడానేత చేతుల్లో 30 ఏళ్లుగా నలిగి పోతున్నాయి. ఈయన కనీసం వీటికి లీజు కూడా చెల్లించకుండా.. టీడీపీకి చెందిన నేతలకే దర్జాగా సబ్ లీజుకు ఇచ్చుకుంటూ.. భూములు తమ స్వాధీనంలో ఉండేలా మేనేజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు వీటిని ఎలాగైనా హస్త గతం చేసుకొనేందుకు భారీ కుట్రకు తెరలేపారు.
‘సాక్షి’ వరుస కథనాలతో..
ఆక్రమణలోని ఈ భూములకు సంబంధించి ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో వక్ఫ్ బోర్డు అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ భూములను పచ్చ గద్దల చెర నుంచి రక్షించేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఈనెల 22వ తేదీన ఏక్ సాల్ (ఒక సంవత్సరం సాగు) లీజ్ కోసం బహిరంగ ప్రకటన జారీ చేశారు. ఈ నెల 31న తహసీల్దార్ కార్యాలయంలో ముతావలి, తాడిగడప మునిసిపల్ కమిషనర్, రెవెన్యూ అధికారుల సమక్షంలో ఏక్‌సాల్ వేలం జరిపేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఈ భూములు అత్యంత విలువైనవి కావడంతో వేలాన్ని ఎలాగైనా అడ్డుకొని భూములను తమ గుప్పిట్లో ఉంచుకొనేలా టీడీపీ బడానేత రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా వక్ఫ్ బోర్డులో కీలకంగా వ్యవహరించే వ్యక్తికి కోట్లల్లో భారీగా ముడుపులు ఇచ్చి అతన్ని ప్రసన్నం చేసుకున్నట్లు సమాచారం. దీంతో పాటు ఈ వేలం జరగకుండా వక్ఫ్ బోర్డులోని ఇంటి దొంగలే టీడీపీ బడా నేతకు పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.
రూ. 400 కోట్ల విలువ..
పెదపులిపాక గ్రామ సర్వే నంబర్ 87లో 12.59 సెంట్లు, తాడిగడప గ్రామ సర్వే నంబర్ 173లో 4.08సెంట్లు, సర్వే నంబర్ 176లో 12.92 సెంట్లు, సర్వే నంబర్ 79లో 13.41 ఎకరాలు, మొత్తం 42.90 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి. ఈ భూముల విలువ ఎకరా రూ. 10 కోట్లు అంటే మొత్తం దాదాపు రూ.400 కోట్ల విలువ చేస్తాయి. ఈ భూములకు వక్ఫ్ లీజు రూల్స్ ప్రకారం సంవత్సర కాలం ఫిబ్రవరి 1 నుంచి జనవరి 31, 2026 లీజుకు ఇచ్చేందుకు వక్ఫ్ అధికారులు బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గ్రామాల్లో టాంటాం వేయడంతో పాటు పెద్దపులిపాక పంచాయతీ కార్యాలయం, తాడిగడప మునిసిపాలిటీ వద్ద నోటీసులు అంటించారు.
వేలాన్ని రద్దు చేసేందుకు..
ఈ వేలాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని.. పథకం ప్రకారం ఆ బడా నేత కనుసన్నల్లో 15 మంది టీడీపీ నేతలు గుట్టు చప్పుడు కాకుండా ఇటీవల రాత్రి వేళ ప్రవేశించి భూములను దున్ని, కొంత పొలంలో వరి నాట్లు సైతం వేశారు. దీంతో వెంటనే వక్ఫ్ అధికారులు జాయింట్ కలెక్టర్, ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భూములు ఆక్రమించిన వారిపై ఫిర్యాదు చేయాలని ఆదేశించడంతో ఇన్ స్పెక్టర్, ఆడిటర్ వక్ఫ్ పెనమలూరు పోలీసులకు, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. పచ్చనేతలు, వక్ఫ్ పెద్దలు, అండదండలు ఆ బడానేతకు ఉండటంతో స్థానిక అధికారులు పట్టించుకోలేదు. భూముల్లోకి అక్రమంగా ప్రవేశించిన కేసు నమోదు చేయలేదు. ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తాము ఆ భూముల్లో పంటలు సాగు చేశామని, వ్యవస్థలోని లోసుగులను సాకుగా చూపి వేలాన్ని రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ముస్లిం పెద్దలు కోట్ల విలువైన వక్ఫ్ భూములను పచ్చనేత చెర నుంచి కాపాడి, లీజుకు ఇస్తే లక్షల్లో ఆదాయం వస్తుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఈ వ్యవహారంపైన దృష్టి సారించాలని కోరుతున్నారు.
హస్తగతం చేసుకొనేందుకు భారీ కుట్ర సహకరిస్తున్న ‘వక్ఫ్’ ఇంటి దొంగలు పట్టించుకోని అధికారులు ఈనెల 31న జరుగనున్న భూముల వేలాన్ని రద్దు చేసే యత్నాలు
Comments
Please login to add a commentAdd a comment