దుర్గగుడిలో దళారీల దందా
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై బుధవారం కొత్త రకం దందా వెలుగులోకి వచ్చింది. వీఐపీ దర్శనాల పేరిట భక్తుల నుంచి అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న ఓ దళారీని ఆలయ అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసు, సెక్యూరిటీ సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకుని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ దళారీ సెల్ఫోన్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. అతనికి, ఆలయంలో విధులు నిర్వర్తించే అనేక మంది సిబ్బంది మధ్య భారీగా ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. గత నెల రోజుల వ్యవధిలో అతని ఫోన్ పే నుంచి సుమారు రూ. లక్ష మేర ఆలయ ఉద్యోగులకు చెల్లించినట్లు తెలుస్తోంది. ఎవరెవరికి డబ్బులు చెల్లించాడనే వివరాలను రికార్డు చేసుకున్న పోలీసులు ఆ లిస్టును ఆలయ అధికారులకు అందజేశారు. కొంత మంది సెక్యూరిటీ సిబ్బంది నుంచి ఆలయంలో విధులు నిర్వర్తించే వారు, బోయలు సైతం దళారీకి అనుకూలంగా దర్శనాలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
రద్దీ వేళలో వీఐపీ దర్శనాలు..
దుర్గగుడికి శుక్ర, శని, ఆదివారాలతో పాటు పండుగలు, పర్వదినాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. హైదరాబాద్ వంటి మహా నగరాల నుంచి విచ్చేసే భక్తులే ఈ దళారుల టార్గెట్. ప్రకాశం బ్యారేజీ, దర్గా, కనకదుర్గనగర్, దుర్గాఘాట్, చైనావాల్ పరిసరాల్లో తిరుగుతూ తెలంగాణ నుంచి కార్లలో వచ్చే భక్తులతో మాట్లాడి వారికి వీఐపీ దర్శనం చేయిస్తారు. వీఐపీ దర్శనానికి ఒక్కొక్కరి నుంచి రూ. 500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. అయితే ఈ దళారులను ఆశ్రయించిన వారికి ఆలయంలో ఎంత రద్దీ ఉన్నా అరగంటలో దర్శనం చేయించి కొండ కిందకు దింపేస్తారు. ప్రస్తుతం అధికారులకు చిక్కిన వ్యక్తితో పాటు గతంలో దుర్గగుడిలో పని చేసి మానేసిన మరో పది మంది ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ వీఐపీ దర్శనాలు చేయిస్తున్నట్లు విచారణలో గుర్తించారు. కొంత కాలం కిందట ఇటువంటి వారిపై నిఘా పెట్టి, వారు కొండపైకి రాకుండా చర్యలు తీసుకున్నా, ఆలయ సిబ్బంది సహకారంతో మళ్లీ దందాను కొనసాగిస్తున్నారు.
వీఐపీ దర్శనాల పేరిట దోపిడీ
భక్తుల నుంచి అధిక రుసుము వసూలు ఓ దళారీని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫోన్‌పేలో విస్తుపోయే నిజాలు అనేక మంది ఆలయ సిబ్బందికి నగదు బదిలీ జరిగినట్లు గుర్తింపు
వెలుగు చూసింది ఇలా..
మల్లికార్జునపేటలో నివాసం ఉండే ఈ వ్యక్తి బుధవారం ఉదయం మహా మండపం ప్రసాదాల కౌంటర్ల వద్ద కనిపించడంతో ఆలయ ఏఈవో చంద్రశేఖర్ సెక్యూరిటీ, హోంగార్డులను అప్రమత్తం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన సెక్యూరిటీ అధికారులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఆలయ ప్రాంగణంలోని అవుట్ పోస్ట్‌కు తరలించారు. అతన్ని విచారించగా.. పేరు ‘డెప్యూటీ’ అని చెప్పుకున్నాడు. పూర్తి పేరు, వివరాలు తెలుపలేదు. ఈ సమయంలోనే ఆ దళారీ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కాల్ డేటా, ఫోన్ పేను పరిశీలించారు. ఒకే రోజు ఆలయానికి చెందిన ఉద్యోగులతోనూ, సిబ్బందితోనూ పలు మార్లు మాట్లాడి దర్శనాలు చేయించినట్లు గుర్తించారు. దీంతో ఆలయ డీఈవో రత్నరాజుకు విషయం గురించి చెప్పగా, ఆలయ ఈవో రామచంద్రమోహన్ దృష్టిలో పెట్టారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు దేవస్థాన అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేయకుండా దళారులను పూర్తి స్థాయిలో నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment