నేడు జెడ్పీ బడ్జెట్ సమావేశం
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పరిషత్ బడ్జెట్ సమావేశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సమావేశంలో ఏ విధమైన కొత్త పనులు మంజూరు చేయరని, కొత్త నిర్ణయాలు తీసుకోరని తెలిపారు. సాధారణ జిల్లా పరిషత్ నిర్వహణకు సంబంధించిన అత్యవసర విషయాలపై మాత్రమే సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు.
జంతు సంక్షేమం
మనందరి బాధ్యత
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): జంతు సంక్షేమం మనందరి బాధ్యత అని.. జిల్లాలో జంతు సంరక్షణలో స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. జంతు సంక్షేమ పక్షోత్సవాలు (జనవరి 14–30) సందర్భంగా జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా విద్యార్థులకు గ్రామ, మండల స్థాయిలో క్విజ్, వక్తృత్వ, వ్యాసరచన అంశాలలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలకు బుధవారం జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహిచారు. విజేతలకు కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్లో సర్టిఫికెట్లు, బహుమతులు అందజేసి, అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక అధికారి డాక్టర్ ఎం.హనుమంతరావు, డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మోసెస్ వెస్లీ, ఏడీ వి. కృష్ణమూర్తి, సమగ్రశిక్ష ఏఎంవో ఎస్.అశోక్ బాబు పాల్గొన్నారు.
కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో బుధవారం రెవెన్యూ, పరిశ్రమలు, చేనేత, పెడన మునిసిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో గుర్తించిన స్థలాలు ఎంఎస్ఎంఈకి బదిలీ చేయాలన్నారు. పెడన శాసనసభ్యుడు కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పెడనలో కలంకారీ క్లస్టర్ పనులు వేగంగా జరిగేలా చూడాలని, దీని ద్వారా కార్మికుల ఉపాధికి అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, ఆర్డీవో కె. స్వాతి, జిల్లా పరిశ్రమల అధికారి ఆర్. వెంకట్రావు, పెడన మునిసిపల్ కమిషనర్ ఎం గోపాలరావు, తహసీల్దార్ కె. అనిల్ తదితరులు పాల్గొన్నారు.
రోగులకు నాణ్యమైన సేవలు అందించాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. జిల్లాలోని పలు పీహెచ్సీల్లో బుధవారం ఆమె ఆకస్మిక తనిఖీలు చేశారు. అందులో భాగంగా పలు గ్రామాల్లో జరుగుతున్న ఎన్సీడీ–సీడీ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న తీరును పరిశీలించిన ఆమె, ఒక గృహం వద్దకు వెళ్లి వారికి చేస్తున్న ఆరోగ్య పరీక్షలను తనిఖీ చేశారు. అంతేకాకుండా వెలగలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి వ్యాధి నిరోధక టీకాలు నిల్వలు, వాటిని సురక్షితంగా ఉంచిన తీరును పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ మాధురి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment