
బాబూ జగ్జీవన్‌రామ్ మానవతావాది
కోనేరుసెంటర్: మానవతావాదం, ఆదర్శవాదం భారత మాజీ ఉప ప్రధానమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత బాబూ జగ్జీవన్‌రామ్‌కే సొంతమని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు పేర్కొన్నారు. భారత మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రామ్ జయంతిని శనివారం జిల్లా పోలీసు క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జగ్జీవన్‌రామ్ నేటి తరానికి ఆదర్శప్రాయుడన్నారు. సామాజిక న్యాయంతో పాటు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు పోరాటాలు చేసిన యోధుడు జగ్జీవన్‌రామ్ అన్నారు. నిమ్న జాతుల అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. అంటరానితనాన్ని నిర్మూలించేందుకు మహాత్మాగాంధీతో కలిసి అనేక పోరాటాల్లో పాల్గొన్నారని చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో క్విట్ ఇండియా, శాసనోల్లంఘన ఉద్యమాల్లో సైతం గాంధీతో కలిసి ఆయన కూడా అడుగులు వేశారన్నారు. అటువంటి గొప్ప నాయకుడిని స్మరించుకోవటం మనందరి అదృష్టమన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్, ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు