వివాహేతర సంబంధం... వేరే వాళ్ళతో మాట్లాడొద్దు | - | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం... వేరే వాళ్ళతో మాట్లాడొద్దు

Published Wed, Jun 21 2023 7:48 AM | Last Updated on Wed, Jun 21 2023 8:17 AM

- - Sakshi

కర్నూలు: వివాహేతర సంబంధం మహిళ ప్రాణాలను బలిగొంది. ఈనెల 17న పట్టణంలో మారుతీనగర్‌లో చోటుచేసుకున్న మహిళ హత్యలో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి కటకటాలకు పంపారు. మంగళవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో సీఐ విజయభాస్కర్‌తో కలిసి డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. కొత్తపల్లి మండలం ఎర్రమఠం గ్రామానికి చెందిన గుర్రం రాములమ్మకు 20 ఏళ్ల క్రితం పగిడ్యాలకు చెందిన బాలయ్యతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

మనస్పర్థల కారణంగా ఎనిమిదేళ్ల క్రితం భర్తతో విడిపోయి మారుతీనగర్‌లో నివాసముంటూ ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో మాధవరం వెంకటేశ్వర్లుతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో అతడు తరచూ మారుతీనగర్‌లోని ఆమె ఇంటికి వచ్చిపోయేవాడు. కాగా ఈ మధ్య కాలంలో అతని ప్రవర్తన నచ్చక ఇంటికి రానివ్వకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. ఈనెల 17న ఉదయం 10 గంటలకు ఇంట్లోకి వెళ్లి దుస్తుల దుకాణంలో పని మానేయాలని, వేరే వాళ్లతో మాట్లాడొద్దని వాడనకు దిగాడు. ఈక్రమంలో మాటామాటా పెరిగి వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి మెడలోని బంగారు గొలుసు తీసుకుని పరారయ్యాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాధవరం వెంకటేశ్వర్లు తరచూ ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడని స్థానికుల నుంచి సమాచారం తెలుసుకుని అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో అతడిని అరెస్ట్‌ చేసి హత్యకు ఉపయోగించిన కత్తి, బంగారు గొలుసు, దుస్తులు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్‌ఐ ఎన్వీ రమణ, పోలీసు సిబ్బంది ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement