ప్రియురాలికి చీరను తీసుకెళ్లి శవమయ్యాడు! | - | Sakshi
Sakshi News home page

ప్రియురాలికి చీరను తీసుకెళ్లి శవమయ్యాడు!

Published Wed, Jun 21 2023 8:22 AM | Last Updated on Wed, Jun 21 2023 8:24 AM

- - Sakshi

కర్నూలు: స్థానిక భాస్కరాపురం వంతెన వద్ద ప్రాతకోట గ్రామానికి చెందిన రామకిషోర్‌ అలియాస్‌ రాము అలియాస్‌ వెంకటన్న(42) దారుణ హత్యకు గురయ్యాడు. ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకోగా.. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఓ మహిళకు చీరను తీసుకెళ్తున్న క్రమంలో చోటు చేసుకున్న ఘటన వివరాలు పోలీసులు, మృతుని భార్య మాధవి తెలిపిన మేరకు ఇలా.. పగిడ్యాల మండలం కిందిప్రాతకోట గ్రామానికి చెందిన రాము పైప్రాతకోట గ్రామంలోని లక్ష్మన్న మెడికల్‌ షాపులో పనిచేస్తున్నాడు.

ఇతనికి భార్య మాధవి, కొడుకు శరత్‌చంద్ర(9) ఉన్నారు. భార్య ఇంటివద్ద చీరల వ్యాపారం చేస్తుండగా.. మృతుడు మెడికల్‌ షాపు నిర్వహిస్తున్నాడు. ఉదయం ఇంటివద్ద మెడికల్‌ దుకాణం నిర్వహిస్తూ.. రాత్రి లక్ష్మన్నకు చెందిన మరో మెడికల్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి 7.30గంటల ప్రాంతంలో బయటకు వెళ్తున్నట్లు యజమాని లక్ష్మన్నకు చెప్పిన రాము నేరుగా ఇంటికి చేరుకున్నాడు.

ఐదు చీరలు ప్యాక్‌ చేయించుకొని..
ఇంటికి చేరుకున్న రాము స్నానం చేసి కొనుగోలుకు చీరలు తెమ్మన్నారని, ఐదింటిని ప్యాక్‌ చేయాలని భార్యకు తెలిపాడు. చీరల ఫొటోలు వాట్సాప్‌లో పంపుతానని చెప్పినా వినిపించుకోకుండా ప్యాక్‌ చేయించుకున్నాడు. ఇంటి వద్ద చీరలు కొనటానికి ఎవరైనా వస్తే.. వాళ్ల ఇంటికి ఇవ్వొద్దని చెప్పే భర్త ఇలా చేస్తున్నాడేంటని అప్పుడే అనుమానపడినట్లు భార్య తెలిపింది. ఆ తర్వాత తన ద్విచక్ర వాహనం(ఏపీ21 పీ4560)పై సొంత మెడికల్‌ షాపుకు చేరుకున్నాడు.

అక్కడ నాలుగు చీరలు పెట్టి మరో చీరను బైక్‌ ట్యాంకు కవర్‌లో పెట్టుకొని 8గంటల ప్రాంతంలో బయటకు వెళ్లాడు. 8.30గంటల ప్రాంతలో భార్య ఫోన్‌ చేయగా.. మెడికల్‌ షాపులోనే ఉన్నట్లు చెప్పాడు. 9.30గంటల ప్రాంతంలో మరోసారి ఫోన్‌ చేయగా స్విచ్‌ఆఫ్‌ వచ్చినట్లు భార్య చెబుతోంది.

ఓ మహిళతో తరచూ ఫోన్‌
రాము తరచూ ఓ మహిళతో ఫోన్‌లో మాట్లడుతున్నట్లు భార్య చెబుతోంది. ఎవరని అడిగితే మందుల కోసం వచ్చిన వాళ్లని చెప్పేవాడంది. ఆ మహిళ ఫోన్‌ రాగానే ఇంట్లోంచి మిద్దైపెకి, లేదా బయటకు వెళ్లేవాడని వాపోయింది. తనను మాత్రం ఇంట్లోంచి బయటకు రానిచ్చేవాడు కాదని.. ఆర్థిక విషయాలను కూడా ఎప్పుడూ చెప్పలేదని తెలిపింది. అయితే భార్య చెప్పిన వివరాల మేరకు హత్యకు అక్రమ సంబంధం కూడా కారణం కావచ్చని పోలీసులు అనమానిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఎండగా ఆత్మకూరు డీఎస్సీ శ్రీనివాసరావు, నందికొట్కూరు రూరల్‌ సీఐ సుధాకర్‌రెడ్డి, జూపాడుబంగ్లా ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య, ముచ్చుమర్రి ఎస్‌ఐ నాగార్జున, బ్రాహ్మణకొట్కూరు ఎస్‌ఐ ఓబులేసు ఘటనా స్థలిని పరిశీలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పథకం ప్రకారమే జరిగిందా?
చీరను తీసుకొని బైక్‌పై భాస్కరాపురం బ్రిడ్జి సమీపంలోకి రాగానే ఎవరో అతని ౖబైక్‌ను నిలువరించగా రోడ్డు పక్కన నిలిపినట్లు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తే తెలుస్తోంది. పథకం ప్రకారం కొందరు వ్యక్తులు అక్కడ ఘర్షణ పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సమయంలోనే బైక్‌ క్లచ్‌ వైర్‌ను వెనుక నుంచి రాము మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అక్కడే ఉన్న రాళ్లతో ముఖం ఛిద్రం చేశారు. పెనుగులాటలో అతని బూట్లు సమీప కంపచెట్లలో పడినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు ఉపయోగించిన సెల్‌ఫోన్‌ కూడా లభించలేదని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement