నంద్యాల: వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. సాఫీగా సాగిపోతున్న కుటుంబంలో మహిళ దారి తప్పి చివరకు భర్తనే దారుణంగా హత్య చేయించింది. తండ్రి హత్యకు గురికావడం, తల్లి జైలుకెళ్లడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. ఈనెల 4వ తేదీన నంద్యాల పట్టణ శివారులోని అయ్యలూరు మెట్ట వద్ద జరిగిన ప్రైవేటు ఉపాధ్యాయుడు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.
ఈ కేసులో దారుణానికి పాల్పడిన ఏడుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఎస్పీ రఘువీర్‌రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితులను మీడియా ఎదుట హాజరు పరిచి వివరాలు వెల్లడించారు. నంద్యాల మండలం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన సిందే నర్సోజీకి వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన జయశ్రీతో పదేళ్ల క్రితం వివాహమైంది. నర్సోజీ అయ్యలూరు మెట్ట వద్ద ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.
జయశ్రీ(27) గ్రామంలో ఇంటి ఎదురుగా తనకంటే ఐదేళ్లు వయస్సు తక్కువగా ఉన్న రవీంద్ర (22) అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. రవీంద్ర కొబ్బరి తాళ్లు నేస్తున్నాడు. వీరి మధ్య ఆరేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అయితే నెల క్రితం వీరిద్దరి వ్యవహారాన్ని తెలుసుకున్న నర్సోజీ పద్ధతి మార్చుకోవాలని భార్యను మందలించాడు. రవీంద్రను ఇకపై తన ఇంటి పరిసరలా వైపు రావద్దని హెచ్చరించాడు. దీంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించాలని ప్రియుడితో కలసి జయశ్రీ కుట్ర పన్నింది.
స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా..
నర్సోజీని హత్యచేయాలని జయశ్రీ, ప్రియుడు రవీంద్ర పథకం వేశారు. రవీంద్ర స్నేహితులైన మహదేవాపురం గ్రామానికి చెందిన గుండపోగుల రాజేష్, బసాపురం గ్రామానికి చెందిన కాలె వెంకటరమణ, నక్క చిన్న నరసింహులు, నల్లబోతుల వెంకటేశ్వర్లు, పెద్దకొట్టాలకు చెందిన జజ్జం నాగేంద్రకు విషయం చెప్పి హత్యకు కుట్ర పన్నారు. ఈనెల 4వ తేదీ సాయంత్రం అయ్యలూరిమెట్ట సమీపంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో విధులు ముగించుకుని బైక్‌పై తిరిగి వస్తుండగా నర్సోజీ తలపై వెనుక నుంచి గొడ్డలితో దాడి చేశారు. ప్రాణాలు దక్కించుకునేందుకు నర్సోజీ పారిపోతుండగా గొడ్డలితో తలపై నరికి హత్య చేసి నిందితులు పరారయ్యారు.
మృతుడి తల్లి రామబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నంద్యాల తాలూకా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపెట్టింది. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి వారి నుంచి గొడ్డలిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. అడిషనల్ ఎస్పీ వెంకటరాముడు పర్యవేక్షణలో డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సీఐ దస్తగిరిబాబు, ఎస్‌ఐ నాగరాజు, సిబ్బంది చాకచక్యంగా నిందితులను పట్టుకోవటంతో ఎస్పీ వారిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment