మాట్లాడుతున్న కలెక్టర్ డాక్టర్ జి.సృజన
కర్నూలు(సెంట్రల్): నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లాఎన్నికల అధికారి/కలెక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల నిర్వహణ సన్నద్ధత, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, ఆరోగ్య శ్రీ యాప్ డౌన్‌లోడ్, కులగణన సర్వే తదితర అంశాలపై ఆమె రిటర్నింగ్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో జేసీ నారపురెడ్డితో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తహసీల్దార్లు, ఎంపీడీఓల పాత్ర కీలకమన్నారు. ఈక్రమంలో త్వరగా మండలాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వచ్చే 10–15 రోజుల్లో మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి నివేదిక పంపాలన్నారు. సెక్టార్ ఆఫీసర్లు, బీఎల్‌ఓలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఎన్నికల అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.
ఎన్నికల పనులతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై కూడా దృష్టి సారించాలన్నారు. కిందిస్థాయి సిబ్బంది మీద ఆధారపడకుండా రిటర్నింగ్ అధికారి హ్యాండ్‌బుక్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఇతర నియమాలను తప్పనిసరిగా చదివి అవగాహన పెంచుకోవాలన్నారు. సెక్టార్ ఆఫీసర్లతో మాట్లాడుకొని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి చేరేందుకు అవసరమైన రూట్‌మ్యాప్‌లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై సమీక్షలు చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
కులగణన సర్వే 88 శాతం పూర్తి
జిల్లాలో కులగణన సర్వే 88 శాతం పూర్తయిందని, బుధవారంలోపు 90 శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలను కలెక్టర్ సృజన ఆదేశించారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో సర్వేను వేగవంతం చేయించాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీలో రాష్ట్రంలో కర్నూలు జిల్లా టాప్‌లో ఉందన్నారు. కానీ ఆరోగ్యశీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించడంలో మాత్రం జిల్లా దిగువ స్థానంలో ఉన్నట్లు చెప్పారు.
బుధవారంలోపు ఆరోగ్యశ్రీ యాప్ డౌన్‌లోడ్‌లో పురోగతి సాధించేలా చూడాలన్నారు. ఆరోగ్య సురక్ష క్యాంపులకు సంబంధించి వలంటీర్లతో సర్వేను వేగవంతం చేయించాలన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో ఇచ్చిన స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల 9వ తేదీలోపు పూర్తయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జేసీ నారపురెడ్డి మౌర్య, కర్నూలు నగర పాలక కమిషనర్ భార్గవ్‌తేజ, ఆదోని సబ్‌కలెక్టర్ శివనారాయన్ శర్మ, డీఆర్వో కె.మధుసూదన్‌రావు, కర్నూలు, పత్తికొండ ఆర్‌డీఓలు ఎం.శేషిరెడ్డి, రామలక్ష్మి, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment