సీఐల బదిలీల్లో పైరవీలకు ప్రాధాన్యత
కర్నూలు: రకరకాల సిఫారసులు, భారీ పైరవీలతో కర్నూలు రేంజ్ పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్లు పోస్టింగులు దక్కించుకున్నారు. వన్‌సైడ్‌గా పనిచేస్తామని చెప్పడమే కాకుండా పోస్టుకు తగినట్లుగా సమర్పించుకున్న వారికి కుర్చీలు దక్కాయన్న చర్చ జరుగుతోంది. కర్నూలు రేంజ్ పరిధిలో 35 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కల్పిస్తూ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో 13 మందికి, నంద్యాల జిల్లాలో 9 మందికి కలిపి 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కలిగింది.
రెడ్‌బుక్ స్క్రీనింగ్‌తో సీఐల జాబితా విడుదల
ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరికి వారు తమ సీఐల జాబితాను రెడీ చేసి పోలీసు శాఖ ఉన్నతాధికారులకు సమర్పించారు. అన్ని అర్హతలు పరిశీలించి వారం రోజుల క్రితమే జాబితా పోలీస్ హెడ్ క్వార్టర్‌కు చేరింది. అయితే తీవ్ర ప్రతిష్టంభన తర్వాత రెడ్ బుక్ స్క్రీనింగ్‌తో జాబితా విడుదలైనట్లు కొంతమంది పోలీసు అధికారులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. గత టీడీపీ ప్రభుత్వంతో సంబంధాలు ఉన్న వారికి ప్రజాప్రతినిధుల లేఖలు చాలా వరకు పనిచేశాయి. సమర్థులైన పోలీసు అధికారులు స్టేషన్‌లో ఉంటే శాంతిభద్రతల పరిరక్షణ సవ్యంగా సాగుతుందన్న విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలియనిదేమీ కాదు.
అయితే అధికార పార్టీ అనుకూల సామాజిక వర్గానికి చెందిన కొందరు గ్రూపుగా ఏర్పడి రేంజ్ పరిధిలో పోస్టింగుల వ్యవహారంలో చక్రం తిప్పారనే చర్చ జరుగుతోంది. కర్నూలు పరిధిలో ఆరు పోలీస్ స్టేషన్లు ఉండగా కర్నూలు టూటౌన్‌కు సీసీఎస్‌లో ఉన్న జి.వి.నాగరాజరావును నియమించి అక్కడున్న సీఐ ఇంతియాజ్ బాషాను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే కర్నూలు ఎస్‌హెచ్‌ఆర్‌సీలో పనిచేస్తున్న బి.రామకృష్ణ కడప వన్‌టౌన్‌కు బదిలీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment