భక్తిశ్రద్ధలతో సామూహిక కేదారగౌరీ వ్రతాలు
శ్రీశైలంటెంపుల్: కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం ఉచిత కేదారగౌరీ వ్రతాలను నిర్వహించింది. సోమవారం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఉదయం 7.30 గంటలకు, 9.30 గంటలకు రెండు విడతలుగా కేదారగౌరీ వ్రతాన్ని నిర్వహించారు. 376 మంది చెంచు భక్తులు, 960 మంది ఇతర భక్తులు ఈ వ్రతాన్ని జరిపించుకున్నారు. వ్రతానికి కావాల్సిన పూజా ద్రవ్యాలన్నింటినీ దేవస్థానమే సమకూర్చింది. ముందుగా మహాగణపతిపూజ జరిపి వేదికపై ఆశీనులైన స్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ జరిపించారు. అనంతరం భక్తులందరిచే విడివిడిగా కలశస్థాపన చేయించి వ్రతకల్పపూర్వకంగా పూజాదికాలు జరిపారు. ఆలయ అర్చకులు వ్రతకథను పఠించి వ్రతమహిమా విశేషాలను తెలియజేశారు. చివరగా నీరాజన మంత్ర పుష్పాలను జరిపి వ్రతసమాప్తి చేశారు. ప్రసాదాలు, పూలు, గాజులు, రవిక వస్త్రం, కంకణాలు, దేవస్థానం ప్రచురించిన అష్టోత్తర శతనామకదంబ పుస్తకం, ఉసిరి, బిల్వ మొక్కలను అందజేశారు. వ్రతకర్తలకు స్వామిఅమ్మవార్ల దర్శనం, అన్నప్రసాద సదుపాయాన్ని కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment