కర్నూలు(అగ్రికల్చర్): రైతుల సంక్షేమానికి, వ్యవసాయ అభివృద్ధికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పలు పథకాలు అమలు చేయగా.. ప్రస్తుత ప్రభుత్వం ఉన్న పథకాలను నీరుగారుస్తోంది. గత ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా యాంత్రీకరణతో పాటు అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం సిఫారస్సులకు లోబడే యంత్రీకరణ అమలు చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. టీడీపీకి చెందిన వారికే ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారని ప్రజలే చెబుతున్నారు.
టీడీపీ వారికే యంత్రాలు
వ్యక్తిగత వ్యవసాయ యంత్రాల పంపిణీలో టీడీపీ నేతల సిఫార్సులకే వ్యవసాయ శాఖ అఽధికారులు పెద్దపీట వేస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో వ్యవసాయ శాఖ.. రైతులకు వ్యక్తిగతంగా వ్యవసాయ యంత్ర పరికరాలు సబ్సిడీపై పంపిణీ చేస్తోంది. కేంద్రప్రభుత్వ నిధులు 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ నిధులు 40 శాతం నిధులు అందిస్తోంది. కర్నూలు జిల్లాలో రూ.రూ.2.87 కోట్లతో 1,660 యంత్రపరికరాలు, నంద్యాల జిల్లాలో రూ.2.85 కోట్లతో 1,635 యంత్రపరికరాలు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. కర్నూలు జిల్లాకు బ్యాటరీ స్ప్రేయర్లు 250, థైవాన్ స్ప్రేయర్లు 600, ట్రాక్టర్ ఆపరేటెడ్ స్ప్రేయర్లు 7, ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్ 740, రోటావేటర్లు 28, పవర్ వీడర్లు 17, బ్రస్‌కట్టర్లు 13, పవర్ టిల్లర్లు 5 ప్రకారం పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
ఒక్కటి కూడా ఇవ్వకుండా...
నంద్యాల జిల్లాలో థైవాన్ స్ప్రేయర్లు 575 కేటాయించగా.. మిగిలినవన్నీ.. కర్నూలు జిల్లాతో సమానంగా కేటాయించారు. ఒక్కో మండలంలో 30 నుంచి 50 గ్రామాలు ఉంటాయి. బ్యాటరీ స్ప్రేయర్లు, థైవాన్ స్ప్రేయర్లు గ్రామానికి కనీసం ఒక్కటి కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. రోటా వేటర్లు మండలానికి ఒక్కటి ప్రకారమే కేటాయించారు. పవర్ టిల్లర్లు, బ్రస్‌కట్టర్లు, పవర్ వీడర్లు అతి తక్కువగా ఉండటంతో టీడీపీ నేతల ప్రాబల్యం ఉన్న మండలాలకే కేటాయించారు. వ్యక్తిగత యంత్ర పరికరాలు సరఫరా చేసేందుకు దాదాపు 50 కంపెనీలను గుర్తించింది. బ్యాటరీ స్ప్రేయర్లకు రూ.1000, థైవాన్ స్ప్రేయర్లకు రూ.8000 నుంచి 10 వేల వరకు, ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్‌కు కంపెనీని బట్టి గరిష్టంగా రూ,35 వేల వరకు, రోటావేటర్‌కు రూ.46 వేలు, పవర్ వీడర్లకు రూ.30 వేల నుంచి 40 వేల వరకు, బ్రస్‌కట్టర్లకు రూ.25 వేల నుంచి రూ.44 వేలు, పవర్ టిల్లరుకు లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది. ఇంప్లిమెంట్స్ అతి తక్కువగా ఉండటంతో కూటమి నేతల సిఫార్సుల పర్వం జోరుగా సాగుతోంది. వారు ఎవ్వరికి చెబితే వారికే ఇస్తామని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
టీడీపీ నేతలు చెప్పిన వారికే వ్యవసాయ యంత్ర పరికరాలు