
రేపు జల వనరుల శాఖ మంత్రి రాక
కర్నూలు సిటీ: జల వనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు రేపు(మంగళవారం)జిల్లాకు రానున్నారు. కర్నూలు స్టేట్ గెస్ట్‌హౌస్‌కి చేరుకుని ‘కూటమి’ నేతలతో సమావేశం అవుతారు. అనంతరం జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో సమావేశం నిర్వహించనున్నారు. డీఆర్‌సీ సమావేశంలో పాల్గొననున్నారు. డోన్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని రైలులో విజయవాడకు బయలుదేరనున్నారు.
ఇంటి పైకప్పు కూలి వ్యక్తి మృతి
బొమ్మలసత్రం: పట్టణంలోని స్థానిక అంజుమన్ వీధిలో ఆదివారం ఇంటి పైకప్పు కూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. అంజుమన్ వీధికి చెందిన రఫీ అహమ్మద్ (54) తన స్నేహితులతో కలిసి వీధి చివరలో ఉన్న ఓ పాతభవనం కింద నిలబడి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో భవనం పైకప్పు కూలి అతని తలపై పడింది. వెంటనే స్నేహితులు చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. తలకు బలమైన గాయం కావటంతో కోలుకోలేక మృతిచెందాడు. ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.
అనారోగ్యంతో
ఆత్మహత్య
నందవరం: అనారోగ్యంతో నల్లబోతు మహేష్(32) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్మ చేసుకున్నాడు. ఎస్‌ఐ కేశవ, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు మేరకు.. మహేష్ గత కొన్ని నెలలుగా కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ ఉండేవాడు. కొన్ని రోజుల క్రితం ఎమ్మిగనూరు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా తగ్గకపోవడంతో జీవితం మీద విరక్తి పొంది శనివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఉదయం చూసి..పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహానికి ఆదివారం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోర్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మహేష్‌కు భార్య జ్యోతి, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
పండుగ పూట విషాదం
● గేదే ఢీకొని విద్యార్థి దుర్మరణం
కొలిమిగుండ్ల: ఇంటిల్లిపాది పండుగను సంతోషంగా జరుపుకునే సమయంలో గేదే రూపంలో ఓవిద్యార్థిని మృత్యు కబళించింది. ఈవిషాదకర సంఘటన ఆదివారం నందిపాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గుండ్ర నాగన్న, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు నాగార్జున(16) బనగానపల్లె పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతూ ఇటీవలనే పబ్లిక్ పరీక్షలు రాసి ఇంటికొచ్చాడు. ఉదయం పని మీద బైక్‌పై సమీపంలోని తిమ్మనాయినపేట జంక్షన్ వరకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఊరి శివారులోకి వచ్చే సరికి పొలాల్లో నుంచి గేదే వేగంగా ప్రధాన రహదారిపైకి దూసుకొచ్చి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో నాగార్జున ఎగిరి కింద పడటంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ప్రమాద స్థలానికి చేరుకున్నారు. రక్తపుమడుగులో అచేతనంగా పడి ఉన్న కుమారుడి మృతదేహం మీద పడి తల్లి లక్ష్మీదేవి విలపించిన తీరు గ్రామస్తులను కలచివేసింది. పదో తరగతి పరీక్ష ఫలితాలు రాగానే మంచి కళాశాలలో కుమారుడిని ఇంటర్‌లో చేర్పించాలని తల్లిదండ్రులు కలలు కన్నారు. పండుగ రోజే మృత్యుఒడికి చేరడంతో వారి ఆవేదనకు అంతులేకుండా పోయింది. ప్రమాద విషయం తెలుసుకున్న సీఐ రమేష్‌బాబు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.

రేపు జల వనరుల శాఖ మంత్రి రాక