
లారీ ఢీకొని గొర్రెల కాపరి మృతి
నందవరం: లారీ ఢీకొని కురవ లింగారావు(20)అనే గొర్రెల కాపరి మృతి చెందగా, మరో ముగ్గురు గొర్రెల కాపర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన మండల పరిధిలోని ముగతి గ్రామ సమీపంలోని 167వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ కేశవ తెలిపిన వివరాలు ఇవి.. ధర్మపురం గ్రామానికి చెందిన 130 గొర్రెలకు కాపర్లుగా ఎమ్మిగనూరు మండలం కే. తిమ్మపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, ఆస్పరి మండలం జొహరాపురం గ్రామానికి చెందిన కురవ లింగారావు అలియాస్ లింగప్ప, బోయ నరసన్న, గొల్ల నరసప్ప, కురవ బడేసాబ్‌లను కూలీలుగా పెట్టుకున్నారు. ఆదివారం కావడంతో ధర్మాపురం టోల్‌గేట్ వద్ద నుంచి నలుగురు కాపర్లు తెల్లవారుజామున గొర్రెల మందతో ఎమ్మిగనూరు సంతకు బయలు దేరారు. ముగతి గ్రామ సమీపంలోని 167వ జాతీయ రహదారిపై ఎడమవైపు వెళ్లుతున్న గొర్రెల మందతో పాటు కాపర్లును వెనుక నుంచి గుర్తుతెలియని లారీ ఢీకొట్టుకుంటూ వెళ్లింది. తలకు తీవ్ర రక్త గాయం కావడంతో లింగారావు అక్కడిక్కడే మృత్యువాత పడ్డాడు. శ్రీనివాసులుకు కుడి మణికట్టు దగ్గర, కుడి కాలు భాగంలో మోకాలి వద్ద రక్త గాయాలయ్యాయి. బోయ నరసన్నకు మెడ, నడుముకు గాయాలు కాగా, గొల్ల నరసన్న ఎడమ కాలు పాదం దగ్గర ఎముక విరిగింది. కురవ బడేసాబ్‌కు ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదంలో మూడు గొర్రెలు మృత్యువాత పడగా, 20 గొర్రెలు గాయపడినట్లు ఎస్‌ఐ తెలిపారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన గొల్ల నరసప్ప, బోయ నరసన్నలను చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రేఫర్ చేశారు. బాధితుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకుకేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మరో ముగ్గురికి గాయాలు
ముగతి గ్రామ సమీపంలోని
జాతీయ రహదారిపై దుర్ఘటన