
హడావుడిగా ‘మీ సమస్య–మా పరిష్కారం’
కర్నూలు(సెంట్రల్): రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ శుక్రవారం నిర్వహించిన మీ సమస్య – మా పరిష్కారం కార్యక్రమం హడావుడిగా సాగింది. ప్రజల నుంచి అర్జీ రాగానే సంబంధిత అధికారులకు అప్పగించి పరిష్కారం అవుతుందని బాధితులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంగా..11.15 గంటలకు మొదలైంది. అప్పటి నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మౌర్య ఇన్ హోటల్‌లోని ఆర్య ఫంక్షన్ హాలులో నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు మంత్రి టీజీ భరత్ అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. సొంత పార్టీ వారే అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు చెప్పుకునే ప్రయత్నం మంత్రి చేశారని తెలుస్తోంది. కార్యక్రమంలో కలెక్టర్ పి.రంజిత్‌బాషా, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు, టౌన్ డీఎస్పీ బాబు ప్రసాదు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రెండున్నర గంటల్లో ముగిసిన మంత్రి టీజీ భరత్ కార్యక్రమం