శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
● సీపీ అంబర్ కిశోర్ ఝా
వరంగల్ క్రైం : శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా.. అధికారులకు సూచించారు. కమిషనరేట్ పోలీసు అధికారులతో సీపీ మంగళవారం నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా పోలీస్‌స్టేషన్, డివిజనల్, జోన్ల వారీగా పెండింగ్ కేసుల్లోని నిందితుల అరెస్ట్, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్‌షీట్‌కు సంబంధించి కేసుల స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణకు అధికారులు తీసుకోవాల్సిన ముందస్తు చర్యల చర్చించారు. నేరాల కట్టడికి ప్లాన్ ఆఫ్ యాక్షన్‌తో ముందుకు వెళ్లాలని, మహిళలకు సంబంధించిన కేసులపై అధికారులు తక్షణమే స్పందించాలని సూచించారు. పెండింగ్, మిస్సింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. నిజాయితీగా పనిచేయాలని, సివిల్ పంచాయితీలకు దూరంగా ఉండాలన్నారు. తప్పుడు కేసు నమోదు చేయొద్దని, పోలీసులు అప్రమత్తంగా లేకుంటే శాంతిభద్రతలు అదుపు తప్పుతాయని వివరించారు. రౌడీ షీటర్ల స్థితిగతులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని సూచించారు. సమావేశంలో డీసీపీలు షేక్ సలీమా, రవీందర్, ఏఎస్పీ చేతన్‌తో పాటు ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment