మహబూబ్‌నగర్: ప్రమాదవశాత్తు సాగునీటి కాల్వలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఆముదంబండ తండాకు చెందిన ఇస్లావత్ లాలునాయక్, శ్రీనునాయక్‌లు అన్నదమ్ములు. వీరు శుక్రవారం తమ వ్యవసాయ భూమిలో వరినాట్లు వేసేందుకు ఉదయమే కుటుంబసభ్యులందరితో కలిసి పొలం వద్దకు వెళ్లారు.
వర్షం వచ్చేలా ఉండడంతో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇస్లావత్ లాలు, లక్ష్మీ దంపతుల కుమారుడు ప్రవీణ్(9), ఇస్లావత్ శ్రీనునాయక్, ముత్యాలి కుమార్తె వైష్ణవి (7)ని ఇంటికి వెళ్లి నాయనమ్మ వద్ద ఉండమని తల్లిదండ్రులు పంపించారు. వారు ఇంటికి వెళ్లే దారిలో రోడ్డు పక్కనే ఉన్న కర్నె తండా ఎత్తిపోతల కాల్వ కోసం పైపులు వేసేందుకు కాంట్రాక్ట్ గుంతలు తవ్వి ఉంచారు. అయితే మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి గుంతల్లో నీళ్లు నిండాయి. ఇది గమనించని చిన్నారులు కొద్ది నీళ్లు ఉన్నాయి అనుకుని దాటేందుకు వెళ్లి.. అందులో పడిపోయారు.ఎవరూ గమనించకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందారు.
సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు పిల్లలు కనిపించకపోవడంతో తండాలో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో దారివెంట వెతుకుతూ.. అనుమానం వచ్చి నీటి గుంతలో దిగి వెతికారు. దీంతో చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. దీంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. ప్రతి రోజు కళ్లముందు ఆడుతూపాడుతూ కనిపించే చిన్నారులు విగతాజీవులుగా పడిఉండడం చూసి గిరిజనులు కంటతడి పెట్టుకున్నారు. ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment