అచ్చంపేట సభకు హాజరైన జనం
మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరులో సీఎం కేసీఆర్ పర్యటన గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. గురువారం అచ్చంపేట, వనపర్తి నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలు విజయవంతం కావడంతో పార్టీ నాయకుల్లో జోష్ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లాపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.
గత పదిరోజుల వ్యవధిలో ఉమ్మడి జిల్లాలో మూడు చోట్ల నిర్వహించిన బహిరంగ సభలకు సీఎం హాజరయ్యారు. ఈ నెల 18న జడ్చర్లలో, గురువారం ఒకేరోజు అచ్చంపేట, వనపర్తిలో బహిరంగ సభల్లో పాల్గొనడంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.
భారీ జనసమీకరణపై సంతృప్తి..
అచ్చంపేట, వనపర్తిలో నిర్వహించిన బహిరంగ సభలకు బీఆర్‌ఎస్ చేపట్టిన జనసమీకరణ పట్ల సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎండలోనూ ఇంతమంది జనం వస్తారని ఊహించలేదంటూ కితాబిచ్చారు.
అచ్చంపేటలో సుమారు 30 నిమిషాలు, వనపర్తి సభలో 20 నిమిషాల పాటు సీఎం ప్రసంగించారు. సభ అనంతరం ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.
త్వరలోనే ఉమ్మడి జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లోనూ సీఎం పర్యటనకు కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సీఎం కేసీఆర్ బహిరంగ సభల నిర్వహణతో ఎన్నికల ప్రచారం జోరందుకుంది.
‘పాలమూరు’ ప్రచారాస్త్రం..
అధికార బీఆర్‌ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాపై ఫోకస్ పెట్టింది. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం ప్రధాన ప్రచారాస్త్రంగా ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు మొదటి పంపును ప్రారంభించామని, త్వరలోనే ప్రాజెక్టును పూర్తిచేస్తామని హామీ ఇస్తోంది.
ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని, ఈసారి గెలిపిస్తే ప్రాజెక్టు ఫలాలను అందిస్తామని చెబుతోంది. ఈ ప్రాజెక్టు అనుసంధానంగానే అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్, పదర మండలాలకు ఉమామహేశ్వర ఎత్తిపోతల ద్వారా నీటిని అందిస్తామని ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అనంతరం ఇప్పటికే మూడు నియోజకవర్గాల్లో సీఎం పర్యటించడంతో బీఆర్‌ఎస్ ప్రచారంలో ముందు వరుసలో నిలుస్తోంది.
అభివృద్ధి, సంక్షేమంపై భరోసా..
వరుసగా మూడోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ పావులు కదుపుతుండగా.. ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు, లబ్ధిదారులపైనే ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది.
ప్రతి నియోజకవర్గంలోనూ పెద్ద సంఖ్యలో ఉన్న లబ్ధిదారులు తమకు అండగా ఉంటారని భావిస్తోంది. నియోజకవర్గాల్లోని గ్రామాలు, వార్డుల వారీగా రైతుబంధు, బీమా, పింఛన్లు, ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారుల జాబితాను లెక్కలు వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment