దేవరకద్రలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్, పక్కన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
మహబూబ్‌నగర్: ‘పాలుగారిన పాలమూరు జిల్లాను సమైక్య రాష్ట్రంలో ముంచింది కాంగ్రెస్ పార్టే. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రులు జిల్లాను దత్తత తీసుకుని.. ప్రాజెక్టులకు పునాదులు వేశారే తప్పా బాగు చేసిందేమీ లేదు.’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఉమ్మడి పాలమూరులోని దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట నియోజకవర్గ కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతమయ్యాయి.
సీఎం కేసీఆర్ ప్రసంగం గులాబీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. కాగా.. హెలీకాప్టర్‌లో సాంకేతిక సమస్యతో ఆలస్యం కావడంతో.. సాయంత్రం నారాయణపేటలో సభ ముగిసిన తర్వాత ప్రత్యేక బస్సులో రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయా సభల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం వల్ల పాలమూరు సస్యశ్యామలమైందని, వలస కూలీల జిల్లాకే ఇప్పుడు వలసలు వచ్చేలా మారిందని పేర్కొన్నారు.
తెలంగాణ వచ్చాక కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసినట్లు గుర్తు చేశారు. దేవరకద్ర నియోజకవర్గంలో సైతం పెండింగ్‌లో ఉన్న కోయిల్‌సాగర్ ప్రాజెక్టును ఇక్కడి ఎమ్మెల్యే నిలబడి పూర్తి చేసుకొని నీళ్లు తెచ్చే ప్రయత్నం చేశారన్నారు. పాలమూరు ఎత్తిపోతలలో భాగంగా ఎక్కువ నష్టం జరగకుండా కర్వెన రిజర్వాయర్‌ను కట్టుకున్నామని, దీని ద్వారా 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు రాబోతుందన్నారు.
ఇందులో దేవరకద్రకు 60 వేల ఎకరాలకు సాగునీరు లభిస్తుందన్నారు. ఇక్కడి ఎమ్మెల్యేకు చెక్‌డ్యాంల వెంకటేశ్వర్‌రెడ్డిగా పేరు పెట్టాలని, పట్టుబట్టి 30 చెక్‌డ్యాంలు మంజూరు చేయించి సుమారు లక్ష ఎకరాలను సాగులోకి తెచ్చారని కొనియాడారు. మూడోసారి 50 వేల మెజార్టీతో ఆయనను గెలిపించాలని పిలుపునిచ్చారు.
పేటలో పచ్చని పంటలు పండిస్తా..
నారాయణపేట, మక్తల్‌కు నీళ్లొచ్చే కాల్వ మంజూరు చేశామని, ఏడెనిమిది నెలల్లో పూర్తయి నీళ్లొస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. రాజేందర్‌రెడ్డి జాయమ్మ చెరువును మరిచినా తనకు గుర్తుందని, ఈ చెరువుకు నీళ్లు వచ్చేలా చూస్తామన్నారు. కర్టాటక సరిహద్దులో ఉన్న కానుకుర్తి దగ్గర రిజర్వాయర్ కట్టించి.. నారాయణపేట ప్రాంతంలో పచ్చటి పంటలు పండేలా చేస్తానన్నారు.
ఎన్నికల తర్వాత రాజేందర్‌రెడ్డి కోరిన కోరికలు తీర్చి జీఓ ఇచ్చి పూర్తి చేసే బాధ్యత తనదే అన్నారు. రాజేందర్‌రెడ్డి నువ్వు హుషార్ చేసి ప్రజల మధ్య ఇరికిచ్చినవ్.. అయినా పర్లేదు వాటిని తీర్చుతానని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ముందుకు పోవాలంటే బీఆర్‌ఎస్ మాత్రమే తెలంగాణకు శ్రీరామరక్ష.. కాంగ్రెస్, బీజేపీ నాయకుడైవెన జై తెలంగాణ అన్నారా.. పదవుల కోసం.. కాంట్రాక్టు కోసం పోటీ పడ్డారు.
కానీ, జై తెలంగాణ అనలేదు. 24 గంటలు కరెంట్ ఉండాలంటే రాజేందర్‌రెడ్డిని గెలిపించాలి.. తెలంగాణ ఉద్యమంలో నారాయణపేటకు వచ్చాను. అప్పట్లో బొంబాయికి వలస వెళ్లే బస్సులు కనిపించేవి. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అల్లా దయతో రాష్ట్రం వచ్చింది. మరోసారి చెబుతున్నా తెలంగాణ గద్దల పాలు కావొద్దంటే.. రాజేందర్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రపంచ దేశాల్లో విద్వత్ గద్వాలగా పేరు..
గద్వాల చరిత్ర చాలా గొప్పదని.. ప్రపంచ దేశాల్లో విద్వత్ గద్వాలగా గుర్తింపు ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తిరుపతి వేంకట కవులను సన్మానించిన గొప్ప చరిత్ర గద్వాలది అని.. అందుకే దేశంలోని శక్తిపీఠాల్లో ఒకరైన జోగుళాంబ తల్లి పేరిట జిల్లాను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఒకవైపు కృష్ణా.. మరోవైపు తుంగభద్ర నదులతో అలరారుతున్న ప్రాంతాన్ని ఆగం లేపిన పార్టీ ఏదో మీకు తెలుసు అని.. అందుకే ఓటేసేటప్పుడు ఆభ్యర్థి గుణం.. గణంతో పాటు అతని వెనకాల ఉన్న పార్టీ చరిత్రను కూడా చూసి.. ఓటేయాలని కోరారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి నిలబడ్డారని.. పదేళ్లలో మనం ఏం సాధించుకున్నామో.. ఎంత అభివృద్ధి చెందామో గుర్తించాలని హితవు పలికారు. కృష్ణమోహన్‌రెడ్డిని గతంలో కంటే ఈసారి మరో 10 వేల ఎక్కువ మెజార్టీతో గెలిపించి.. గద్వాలను గబ్బు పట్టించినోళ్లను తరమికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం గద్వాలలో నిర్వహించి ఎన్నికల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాంత కృష్ణానది నీళ్లను అనంతపురం జిల్లాకు తరలించుకుపోతుంటే ఇక్కడి నాయకులు హారతులు పట్టిందెవరో మీకు తెలుసు అని పరోక్షంగా డీకే అరుణనుద్దేశించి ఘాటుగా విమర్శించారు.
ఉమ్మడి పాలమూరుకు సంబంధించి గద్వాలలోనే వాల్మీకి బోయలు అత్యధికంగా ఉన్నారని, ఈ ప్రాంతంలోని బోయలను బీసీలుగా పెట్టి ఆంధ్రలో ఎస్టీలుగా పెట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి అని, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే ఎవరు అడ్డుకుంటున్నారో మీకు తెలుసు.. నడిగడ్డను ఎండబెట్టి.. ఆర్డీఎస్ కాల్వను ఆగం పట్టించి.. ఆయకట్టుకు నీరు పారకుండా తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని ధ్వజమెత్తారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయాయని.. సాగునీటి ప్రాజెక్టులతో గద్వాల ప్రాంతం పచ్చబడిందన్నారు. ఇప్పటికే నర్సింగ్ కళాశాల వచ్చిందని, 300 పడకల జిల్లా ఆస్పత్రి, మెడికల్ కళాశాల సైతం సాధించుకోవడం జరిగిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేసిందో మీకు తెలుసని.. కష్టపడి గద్వాల అభివృద్ధి కోసం అహరి్నశలు శ్రమించిన కృష్ణమోహన్‌రెడ్డిని మరోసారి గెలిపించుకోవాలని కేసీఆర్ కోరారు.
పంటల సాగులో మక్తల్ నంబర్‌వన్
అసంపూర్తిగా ఉన్న భీమా ఎత్తిపోతలు, సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్లను పూర్తి చేసి సాగునీరు అందించడం వల్ల పంటల సాగులో మక్తల్ నంబర్‌వన్‌గా నిలిచిందని.. ఈ ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో మూడోసారి ఎన్నికలు జరగబోతున్నాయని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీలో నిలబడతారని, కానీ, ఎవరైతే బాగుంటుందో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. వాల్మీకీలను ముంచింది కాంగ్రెస్ పార్టీనే అని, రాష్ట్రంలో మొదట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటమే వాల్మీకులకు శాపమైందని విమర్శించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి వాల్మీకుల సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. మక్తల్ ఎమ్మెల్యే మాట కటువుగా ఉన్నా.. మనసు మాత్రం గొప్పగా ఉంటుందన్నారు. మక్తల్‌కు 150 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని మంజూరు చేశామని, ప్రభుత్వం ఏర్పడిన నెలరోజుల్లోనే ఆత్మకూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. దివంగత చిట్టెం నర్సిరెడ్డి వారసుడిగా వచ్చి మక్తల్‌కు సేవ చేస్తున్నారని.. నియోజకవర్గ ప్రజలు ఈసారి కూడా కారు గుర్తుకు ఓటేసి రామ్మోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.
పాలమూరులో స్వాగతం..
ప్రజాఆశీర్వాద సభలు ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వన్‌టౌన్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పూలు చల్లి స్వాగతం పలికారు. దేవరకద్ర సమావేశంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎంపీ మన్నెశ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్ రెడ్డి, మాజీ మంత్రులు నాగం జనార్దన్‌రెడ్డి, పి.చంద్రశేఖర్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఇంతియాజ్ ఇసాక్, వాల్యనాయక్, మాజీ స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment