పాల‌మూరు యూనివ‌ర్సిటీలో దారుణం! డిబార్ చేశార‌ని.. విద్యార్థి? | - | Sakshi
Sakshi News home page

పాల‌మూరు యూనివ‌ర్సిటీలో దారుణం! డిబార్ చేశార‌ని.. విద్యార్థి?

Published Thu, Dec 21 2023 1:06 AM | Last Updated on Thu, Dec 21 2023 8:29 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పరీక్షలో చూచిరాతలు రాశాడన్న నెపంతో పాలమూరు యూనివర్సిటీ అధికారులు ఓ విద్యార్థిని డీబార్‌ చేయడం.. మనస్తాపంతో ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా మాగనూర్‌ మండలం అచ్చంపేటకు చెందిన పూజారి ఆంజనేయులు (18) మక్తల్‌ పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

మరికల్‌లోని ఓ పరీక్ష కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మొదటి సెమిస్టర్‌ పరీక్షకు హాజరైన ఆంజనేయులు.. చూచిరాతలకు పాల్పడుతున్నాడని పరీక్ష స్క్వాడ్‌ అధికారులు డీబార్‌ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థి.. స్వగ్రామానికి చేరుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్పందించిన పీయూ వీసీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ విచారణకు ఆదేశించారు.

ఈ మేరకు విద్యార్థి పరీక్ష రాసిన కేంద్రంలో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ రాజ్‌కుమార్‌, వీసీ ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి, పొలిటికల్‌ సైన్స్‌ హెచ్‌ఓడీ కుమారస్వామిలతో కూడిన కమిటీ తనిఖీలు చేపట్టారు. త్వరలో విచారణకు సంబంధించిన నివేదికను పీయూ వీసీకి అందించనున్నారు.

ఎగ్జామినర్‌ సస్పెన్షన్‌..
విద్యార్థి పరీక్ష రాసిన కేంద్రంలో విధులు నిర్వహించిన ఎగ్జామినర్‌ను విధుల నుంచి సస్పెన్షన్‌ చేయడంతో పాటు చీఫ్‌ సూపరింటెండెంట్‌, సిట్టింగ్‌ స్క్వాడ్స్‌కు నోటీసులు ఇస్తున్నట్లు వీసీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ ప్రకటనలో పేర్కొన్నారు.

సదరు విద్యార్థి చూచిరాతలు రాసేందుకు అవసరమైన చీటీలు పరీక్ష కేంద్రంలోకి తీసుకొచ్చే క్రమంలో సదరు అధికారులు ఏం చేశారనే అంశంపై విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. వారు విధులు సరిగ్గా నిర్వహించకపోవడంతోనే విద్యార్థి పరీక్ష కేంద్రంలోకి చీటీలు తీసుకొచ్చి రాస్తూ పీయూ నుంచి వెళ్లిన స్క్వాడ్‌ అధికారులకు దొరికిపోయినట్లు తెలిసింది.

విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి..
విద్యార్థి ఆంజనేయులు కుటుంబానికి న్యాయం చేయాలని పలు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వీసీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌, రిజిస్ట్రార్‌ గిరిజకు కలిసి విన్నవించారు.

ఈ సందర్భంగా పీయూ జేఏసీ చైర్మన్‌ బత్తిని రాము మాట్లాడుతూ స్క్వాడ్‌ అధికారులు తీసుకునే చర్యలపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం, విద్యార్థులను ఇష్టారీతిగా డీబార్‌ చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

నోటీసులు ఇస్తాం...
మరికల్‌ పరీక్ష కేంద్రంలో జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాం. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తాం. సంబంధిత పరీక్ష కేంద్రంలోని ఎగ్జామినర్‌, సీఎస్‌లకు నోటీసులకు ఇవ్వనున్నం. భవిష్యత్‌లో వారికి పరీక్షల విధులు కేటాయించకుండా చర్యలు తీసుకుంటున్నాం. – రాజ్‌కుమార్‌, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌, పీయూ

విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలి
విద్యార్థిని డీబార్‌ చేయడం వల్ల ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఈ విషయంపై వీసీతో పాటు అదికారులకు ఫిర్యాదు చేశాం. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. – బత్తిని రాము, పీయూ జేఏసీ చైర్మన్‌

పరీక్ష కేంద్రం మార్చాలని ఆందోళన..
మరికల్‌: మరికల్‌లో ఏర్పాటు చేసిన డిగ్రీ మొదటి సంవత్సరం సెమిస్టర్‌ పరీక్ష కేంద్రాన్ని మార్చాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు పీయూ ఏఎస్‌డీ మధుసూదన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఏఎస్‌డీ మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు పరీక్ష కేంద్రాన్ని మార్చడం కుదరదని, వచ్చే అకాడమిక్‌ సంవత్సరం నుంచి పరీక్ష కేంద్రాన్ని మార్చే ఆలోచన చేస్తామని తెలిపారు. పరీక్ష తప్పితే మరో ఏడాది రాసుకునేందుకు అవకాశం ఉంటుందని, విద్యార్థులెవరూ ప్రాణాలను తీసుకోరాదని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement