‘నిబద్ధత ఉన్నవారికి ఓటువేయాలి’ | Sakshi
Sakshi News home page

‘నిబద్ధత ఉన్నవారికి ఓటువేయాలి’

Published Thu, May 9 2024 4:55 AM

‘నిబద్ధత ఉన్నవారికి ఓటువేయాలి’

కల్వకుర్తి టౌన్‌: ఎన్నికల్లో నిబద్ధత కలిగిన అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయాలని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అకునూరి మురళీ అన్నారు. పట్టణంలోని పాలమూరు చౌరస్తాలో జాగో తెలంగాణ పేరుతో బస్సుయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆదిలాబాద్‌ నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర బుధవారం రాత్రి కల్వకుర్తి పట్టణానికి చేరుకుంది. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రాజకీయ పార్టీలకు ఓటువేయవద్దని పిలుపునిచ్చారు. రాజకీయాలంటే ప్రజల స్థితిగతులను మార్చేలా ఉండాలే తప్పా.. భయపెట్టి రాజకీయాలు చేసేవారిని, ఓటు ద్వారా వారికి బుద్ధి చెప్పాలన్నారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో మన ప్రాంతానికి అభివృద్ధి జరిగేలా, ప్రాంతానికి న్యాయం చేసే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. విద్వేష విభజనతో నియంతృత్వ రాజకీయాలు చేసే వారిని ఓడించాలన్నారు. గడీల పాలన కూలగొడతానని రాజకీయాల్లోకి వచ్చిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, నేడు బీఆర్‌ఎస్‌లో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీచేయటం సిగ్గుచేటన్నారు. అతను తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత, విలువలు కలిగిన రాజకీయం చేస్తాడని అనుకున్నా.. ఇలా విలువలు లేని పార్టీలో ఎంపీగా పోటీచేస్తాడని అనుకోలేదన్నారు. బస్సుయాత్ర ద్వారా ఓటర్లలో చైతన్యం కలిగించి, నిజంగా ప్రజలకు సేవచేసే వారిని ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు. కల్వకుర్తి నుంచి బయలుదేరిన బస్సుయాత్ర రాత్రికి నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో బసచేస్తారని తెలియజేశారు. కార్యక్రమంలో హెచ్‌సీయూ ప్రొ.లక్ష్మీనారాయణ, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ప్రొ.వినయ్‌, రిటైర్డ్‌ ప్రొ.పద్మజ, స్వచ్ఛంద సభ్యులు మహేష్‌, రాయ్‌, సౌజన్య, కల్పన పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement