
కొనుగోళ్లకు సన్నద్ధం
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో ఇప్పటికే వరి కోతలు మొదలయ్యాయి. మొదట కోసిన రైతులు ధాన్యాన్ని వ్యాపారులకు అమ్మకాలు చేస్తుండగా.. సన్నరకం వేసిన రైతులు మాత్రం కొనుగోలు కేంద్రాల కోసం వేచి చూస్తున్నారు. ప్రభుత్వం దొడ్డు ర కం ధాన్యం కంటే సన్న రకాలకు ప్రాధాన్యం ఇస్తూ క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్ ఇస్తుండటంతో యాసంగి సీజన్‌లోనూ సన్నాలే సేద్యం చేశారు. అయితే ఈసారి యాసంగి ధాన్యం కొనుగోళ్లలో మహిళా గ్రూపులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అన్ని మండలాల పరిధిలో సహకార సంఘాల మా దిరిగానే మహిళా గ్రూపులతో కొనుగోలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో వారికి అవకాశం కల్పించి సంఘాలను మరింత బలోపేతం చేయనున్నారు. దీనికితోడు పీఏసీఎస్‌ల ద్వారా కొనుగోలు చేయడం వల్ల ప్రతి సీజన్‌లో ఇబ్బందులు ఎదురుకావడంతోపాటు క్వింటాల్‌కు ఎక్కువ మొత్తంలో తరుగు తీస్తున్నారనే ఆరోపణలు రావడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది.
ఈసారి కూడా..
ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వ యంత్రాంగం రైతుల వద్ద నుంచి ఏ– గ్రేడ్ ధాన్యం మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 నిర్ణయించారు. గత సీజన్‌లో ప్రభుత్వం చెల్లించే ధర కంటే వ్యాపారులే అధిక ధర కల్పించడంతో వానాకాలం ధాన్యాన్ని ఎక్కువగా రైతులు వారికే విక్రయించారు. యాసంగిలో సైతం ధర ఎక్కువగా చెల్లించే వారికే రైతులు వరి ధాన్యాన్ని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.
వాతావరణ మార్పులకు అనుగుణంగా..
అకాల వర్షాలు వస్తే ధాన్యం తడిచి మద్దతు ధర పలకదేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకూ వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారుతుండటంతో కొనుగోలు కేంద్రాల్లో అదనంగా టార్ఫాలిన్లు నిల్వ చేస్తున్నారు. కేంద్రాల్లో ఎక్కువగా ధాన్యం నిల్వలు ఉండకుండా ఎప్పటికప్పుడు రవాణా చేసేందుకు వీలుగా సరిపడా వాహనాలను ఏర్పాటు చేశారు. రైతులకు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే మొదలుపెట్టారు.
సద్వినియోగం చేసుకోవాలి..
జిల్లాలో 188 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. 1.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించాం. సోమవారం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నాం. అలాగే అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోళ్లు చేస్తాం. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.
– రవినాయక్, మేనేజర్, జిల్లా పౌర సరఫరాల సంస్థ
బోనస్ కోసం..
ఆరు ఎకరాల పొలంలో ఆర్‌ఎన్‌ఆర్ సన్న రకం వరి పంట సాగు చేశా. పది రోజుల క్రితం కురిసిన వడగండ్ల వానకు చాలామంది రైతుల పొలాల్లో వరి గింజలు నేలరాలి నష్టపోయారు. అకాల వర్షాలు, మబ్బులు భయపెడుతుండటంతో రైతులు కోతలు మొదలుపెట్టారు. ఇప్పటికే కొంతమంది వ్యాపారులకు అమ్మకాలు చేస్తుండగా.. మరికొంత మంది కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తున్నారు. చాలా మంది రైతులు బోనస్ కోసం కొనుగోలు కేంద్రాల్లో అమ్మేందుకు ఆగాం.
– పెద్దబావి కుర్మయ్య, రైతు, చౌదర్‌పల్లి, మహబూబ్‌నగర్ రూరల్
జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు
నేటి నుంచి ధాన్యం సేకరణ ప్రారంభం
ఈసారి కొనుగోళ్లలో మహిళా సంఘాలకు ప్రాధాన్యం
ఇప్పటికే మొదలైన కోతలు.. వ్యాపారులకు అమ్మకం
గతేడాది అత్యధికంగా
ప్రైవేట్‌లోనే విక్రయం

కొనుగోళ్లకు సన్నద్ధం

కొనుగోళ్లకు సన్నద్ధం