మంచిర్యాల: అదుపుతప్పిన బైక్ ప్రమాదవశాత్తు కుమురంభీం ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాలువలో దూసుకెళ్లిన ఘటనలో భార్య మృతిచెందగా, భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. మండలంలోని ఇందాని(మోకాసిగూడ) సమీపంలో ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై డి.సాగర్ కథనం ప్రకారం.. మండలంలోని లెండిగూడ గ్రామానికి చెందిన వడై ఇంద్రాజీ–సాక్రుబాయి(28) దంపతులు గత 9 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.
మూడేళ్ల క్రితం బాబు పుట్టిన వెంటనే చనిపోయాడు. అప్పటి నుంచి మళ్లీ సంతానం కలగకపోవడంతో పిల్లల కోసం గత మూడు నెలల నుంచి బెండార శివారులో గల శంకరుని ఆలయంలో ప్రతీ శని, సోమవారాలు పూజలు నిర్వహించేవారు. ఎప్పటిలాగే సోమవారం ఉదయం 5.30 గంటలకు ఇంద్రాజీ, సాక్రుబాయి దంపతులు బెండార శంకరుని గుడికి వెళ్లేందుకు బైక్‌పై బయల్దేరారు. కుమురంభీం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ మీదుగా ఉన్న బీటీ గుండా వెళ్తుండగా మోకాసిగూడ–సరాండి గ్రామాల మధ్యలో ఉన్న మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది.
బైక్‌తోపాటు ఇద్దరు నీటిలో మునిగారు. ఇంద్రాజీకి ఈత రావడంతో వెంటనే తేరుకుని భార్యను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశాడు. కాలువకు సిమెంటు లైనింగ్ ఉండటంతో నీళ్లలో నుంచి బయటికి రాలేకపోయాడు. కొంత సమయానికి అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి సహాయంతో భార్యను బయటికి తీసుకొచ్చాడు. కానీ అప్పటికే సాక్రుబాయి మృతి చెందింది.
కాలువలో నీళ్లతో పాటు నాచు, పూడిక అధికంగా ఉండటంతో బాధితులు బయటపడటంలో ఆలస్యమై ఉంటుందని అక్కడున్న వారు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నీటిలో మునిగిన బైక్‌ను పోలీసులు స్థానికుల సహాయంతో బయటికి తీశారు. మృతురాలి తండ్రి ఆదె మోతీరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment