
ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
భీమారం: లేఅవుట్ లేని భూముల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం కల్పించిన ఎల్‌ఆర్‌ఎస్–2020లో భాగంగా అర్హుల నుంచి రుసుం వసూళ్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం ఆయన మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ పనితీరును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ సకాలంలో రుసుం చెల్లించి భూములను క్రమబద్ధీకరించుకోవాలని తెలిపారు. ఇందుకోసం మున్సిపాలిటీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. వేసవి ఎండల దృష్ట్యా గ్రామాల్లో మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధికి చేయుత అందిస్తోందని, అర్హులు ఈ నెల 14లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని నర్సనిని సందర్శించారు. ఎంపీడీవో మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో బాధ్యతగా వ్యవహరించాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు, వైద్య సిబ్బంది విధుల్లో బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులు, ల్యాబ్, మందుల నిల్వలు, రిజిష్టర్లు, పరిసరాలను పరిశీలించిన అనంతరం సిబ్బందితో మాట్లాడారు. రోగులతో మర్యాదగా వ్యవహరించి మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. వేసవికాలంలో వడదెబ్బ బారిన పడకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
నేడు జయంత్యుత్సవాల
నిర్వహణపై సమావేశం
మంచిర్యాలటౌన్: ఈ నెల 5, 14వ తేదీల్లో మహానీయుల జయంతి ఉత్సవాల నిర్వహణపై ఈ నెల 3న ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్‌లోని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పోటు రవీందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5న డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ 118వ జయంతి, 14న డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ 134వ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆయా కార్యక్రమాల నిర్వహణ కోసం జిల్లాలోని వివిధ సంఘాల ప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని కోరారు.