విద్యార్థులకు డ్రాయింగ్ నేర్పుతున్న పీటీఐ(ఫైల్)
కాసిపేట: జిల్లాలో విద్యాశాఖ వ్యవహరిస్తున్న తీరుతో జిల్లా పరిషత్ పాఠశాలల్లో పని చేస్తున్న పీటీఐ(పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్లు) నష్టపోవాల్సి వస్తోంది. పునర్నియామకంలో జాప్యం కారణంగా ప్రతీ ఏడాది 10 రోజుల నుంచి 40 రోజుల వరకు వేతనం కోల్పోవాల్సి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో పనిచేస్తున్న పీటీఐలను ప్రభుత్వం ప్రతీ విద్యాసంవత్సరం చివరి పనిదినం రోజున తొలగించి మళ్లీ నియమిస్తుంది.
ప్రభుత్వ ఆదేశానుసారం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్‌లు ప్రతీ ఏడాది వీరికి రీ ఎంగేజ్ ఆర్డర్ ఇవ్వగానే అన్ని జిల్లాల్లో పీటీఐలు విధులకు హాజరవుతూ వారి వారి పాఠశాలల ద్వారా సంబంధిత పత్రాలు డీఈవో కార్యాలయానికి పంపిస్తారు. జిల్లాలో కమి షనర్, పీడీ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. నాలుగేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. కలెక్టర్ అప్రూవల్ అయ్యాక స్కూళ్లకు వెళ్లాలని చెబుతూ ఫైల్‌ను ప్రతీ ఏడాది 10 నుంచి 40రోజులు ఆలస్యం చేస్తుండడంతో వేతనాలు కోల్పోతున్నారు.
ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ విభాగంలో జిల్లాలో మొత్తం 69మంది పీటీఐలుగా పనిచేస్తున్నారు. వీరికి వేతనం నెలకు రూ. 11,700 చెల్లిస్తున్నారు. పీటీఐలను కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖాధికారిని సంప్రదించగా.. కలెక్టర్ అప్రూవల్ అయ్యాక విధుల్లోకి తీసుకుంటామని, మిగతా జిల్లాల విషయం తమకు తెలియదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment