బాడీ బిల్డర్స్‌ అడ్డా బెల్లంపల్లి | - | Sakshi
Sakshi News home page

బాడీ బిల్డర్స్‌ అడ్డా బెల్లంపల్లి

Published Fri, Mar 14 2025 1:50 AM | Last Updated on Fri, Mar 14 2025 1:46 AM

బాడీ బిల్డర్స్‌ అడ్డా బెల్లంపల్లి

బాడీ బిల్డర్స్‌ అడ్డా బెల్లంపల్లి

● పోటీల్లో రాణిస్తున్న క్రీడాకారులు ● ప్రాచీన క్రీడకు చేరువవుతున్న యువకులు

బెల్లంపల్లి: బాడీ బిల్డింగ్‌ యువతలో క్రేజీని పెంచుతోంది. దేహదారుడ్యాన్ని పెంపొందించుకోవడానికి నేటితరం యువకులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. రోజువారీగా జిమ్‌కు వెళ్లి శిక్షకుల పర్యవేక్షణలో దేహదారుడ్యాన్ని పెంచుకునే మెలకువలు నేర్చుకుంటున్నారు. ఒకవైపు శిక్షణ తీసుకుంటూనే మరోవైపు బాడీ బిల్డింగ్‌ పోటీల్లో పాల్గొని సత్తా చా టుతున్నారు బెల్లంపల్లికి చెందిన క్రీడాకారులు. ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొని ప్రతిభా పాటవా లను ప్రదర్శిస్తూ ప్రత్యేకతను చాటుతున్నారు. మెడల్స్‌ సాధించి బెల్లంపల్లికి వన్నె తెస్తున్నారు.

జిమ్‌లు వేదికగా...

బెల్లంపల్లి పురాతన కార్మిక క్షేత్రం. క్రీడాకారులకు నిలయమైన బెల్లంపల్లిలో బాడీ బిల్డర్లు మట్టిలో మాణిక్యాలుగా వెలుగొందుతున్నారు. ఎంతోమంది కార్మికులు సింగరేణిలో విధులు నిర్వహిస్తూనే బాడీ బిల్డింగ్‌పై మక్కువ పెంచుకున్నారు. కోలిండియా, సింగరేణిస్థాయి, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. స్థానికంగా ఉన్న జిమ్‌లను వేదికగా ఎంచుకుని ప్రత్యేక సాధన చేస్తున్నారు. సీనియర్‌ బాడీ బిల్డర్లు మురహరిరావు, బాలకృష్ణ, చంద్రశేఖర్‌, మోబిన్‌, తదితరులు వారిని తీర్చిదిద్దడంతో కృతార్థులవుతున్నారు.

నస్పూర్‌లో జరిగిన పోటీల్లో...

మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని సీఈఆర్‌ క్లబ్‌లో ఈనెల 9న ఆదివారం రాత్రి నస్పూర్‌ ఎలిఫెంట్‌ జిమ్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాస్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీలు జరిగాయి. ఇందులో బెల్లంపల్లి స్కైజిమ్‌ క్రీడాకారులు పాల్గొని సత్తా చాటారు. 80 కిలోల విభాగంలో జి.లక్ష్మణ్‌ బంగారు, మాస్టర్‌ విభాగంలో పి.కృష్ణస్వామి బంగారు, 50 కిలోల విభాగంలో వెండి పతకం, 70 కిలోల విభాగంలో కె.అక్షయ్‌ బంగారు పతకం, జూనియర్స్‌ విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకం సాధించారు. 55 కిలోల విభాగం, జూనియర్స్‌ విభాగంలో జరిగిన పోటీల్లో కె.రేవంత్‌ ప్రథమస్థానంలో నిలిచి రెండు బంగారు పతకాలు సాధించాడు. మరో క్రీడాకారుడు జి.రవి 55 కిలోల విభాగంలో చతుర్థ స్థానంలో నిలిచాడు. ఎం.మహేష్‌, ఎం.రోహిత్‌, హూమాయున్‌ ఆయా విభాగాల పోటీల్లో పతకాలు గెలుచుకున్నారు.

గతేడాది మహబూబ్‌నగర్‌లో..

మహబూబ్‌నగర్‌లో గతేడాది నవంబర్‌ నెలలో మిస్టర్‌ తెలంగాణ బాడీ బిల్డింగ్‌ పోటీలు నిర్వహించారు. ఇందులో బెల్లంపల్లి స్కైజిమ్‌ కోచ్‌ సదానందం 65 కిలోల విభాగంలో సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. గతేడాది బెల్లంపల్లిలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీల్లో లక్ష్మణ్‌, కృష్ణ స్వామి బంగారు పతకాలు సాధించారు. ప్రస్తుతం ప్రాచూర్యంలో ఉన్న బాడీ బిల్డింగ్‌ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులు పతకాలు సాఽధిస్తూ అబ్బుర పరుస్తున్నారు. నేటితరం యువతకు మార్గదర్శకంగా

నిలుస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement