మెదక్: శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నర్సాపూర్ నియోజకవర్గంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థిని ప్రకటించలేదు. అందరికన్నా ముందుగా అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్ కూడా నర్సాపూర్‌ను పెండింగ్‌లో పెట్టింది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు కూడా అభ్యర్థుల ఎంపికపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో నర్సాపూర్ అభ్యర్థి విషయంలో ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు, అయోమయానికి గురవుతున్నారు.
బీఆర్‌ఎస్‌లో గందరగోళం..
రాష్ట్రంలోని 115 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ నర్సాపూర్ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో కేడర్‌లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి నర్సాపూర్ నుంచి మరోసారి బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ బీఆర్‌ఎస్ అధిష్టానం మాత్రం మదన్ రెడ్డిని తప్పించి మాజీ మంత్రి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతారెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని భావిస్తోంది. మరోవైపు మదన్‌రెడ్డి తగ్గేదిలేదంటూ నెల రోజులుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అనుచరులతో కలిసి మంత్రి హరీశ్‌రావు ఇంటి ఎదుట ధర్నా చేసిన ఆయన గత నెలలో మెదక్‌లో జరిగిన సీఎం సభలో ఫ్లెక్సీలను ప్రదర్శించి కేసీఆర్ దృష్టిలో పడే ప్రయత్నం చేశారు.
నర్సాపూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించి బల ప్రదర్శన చేయడంతో పాటు ఎన్నికల బరిలో ఉంటానని పలు సందర్భాల్లో ప్రకటనలు చేస్తున్నారు. పార్టీ పెద్దల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో మదన్ రెడ్డి అనుచరులు డీలా పడుతున్నారు. నర్సాపూర్ టిక్కెట్ ఆశిస్తున్న సునీతారెడ్డి అనుచరులు ఈ సారి తమకే టిక్కెట్ అని, సునీతమ్మ పేరును ప్రకటించడమే ఆలస్యమంటూ ఆమె అనుచరులు చెబుతున్నారు. ఎవరో ఒకరి పేరును అధిష్టానం ప్రకటిస్తే తప్ప గందరగోళానికి తెరపడే అవకాశం కనబడడంలేదు.
తేలని హస్తం అభ్యర్థి..
ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. నియోజకవర్గంలో ముగ్గురి పేర్లను ఎంపిక చేసి దరఖాస్తులను పరిశీలనకు ఢిల్లీకి పంపించారు. స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల వడపోత పూర్తి చేసినట్లు సమాచారం. అధికారికంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించడమే మిగిలింది. కాగా నర్సాపూర్ కాంగ్రెస్ టికెట్ కోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్‌కుమార్, టీపీసీసీ ప్రధాకార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్, రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ దరఖాస్తు చేసుకున్నారు. ఎవరికి వారు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నా.. కేడర్‌కు మాత్రం సరైన ధీమా ఇవ్వలేకపోతున్నారు. త
కమలంలోనూ అదే పరిస్థితి..
నర్సాపూర్ నుంచి పోటీ కోసం బీజేపీ అభ్యర్థులు పలువురు టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లిగోపి, అసెంబ్లీ కన్వీనర్ మల్లేశ్ గౌడ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రమేశ్ గౌడ్, రఘువీర్ రెడ్డి, పాపగారి రమేశ్ ఉన్నారు. బీజేపీ అధిష్టానం ఎవరిని ఖరారు చేయలేదు. దీంతో ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకుందామంటే టిక్కెట్ ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. కొద్దో గొప్పో ఉన్న కేడర్‌ను కాపాడుకునేందుకు నాయకులు తంటాలు పడుతున్నారు. మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తేనే నర్సాపూర్‌లో ఎన్నికల కోలాహలం మొదలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment