మెదక్: జిల్లాలో బీఆర్‌ఎస్‌లో రాజకీయం గందరగోళంగా మారింది. రానున్న ఎన్నికల్లో ఎవరికి సీటు వస్తుందో?, ఎవరి కొంప ముంచుతుందో తెలియక ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల పత్రికలు, సోషల్ మీడియాలో 51 మంది పేర్లతో వచ్చిన వార్తల్లో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్‌రెడ్డి పేర్లు లేకపోవడం ఆ పార్టీ కేడర్‌ను కలవరానికి గురిచేస్తోంది. ఈ నెల 21 బీఆర్‌ఎస్ తొలివిడత జాబితా విడుదల చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల టికెట్ ఎవరికి వస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నర్సాపూర్‌పై..
నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి బదులు మహిళా కమిషన్ రాష్ట్ర చైర్‌పర్సన్ సునీతారెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. మదన్‌రెడ్డిపై కొన్ని ఆరోపణలే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆయన అనుచరులు ఇసుక, మట్టిని కొల్లగొట్టారని కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి., పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఇంటెలిజెన్స్ నివేదిక సైతం ఉన్నతాధికారులకు చేరినట్లు ప్రచారం. మరోవైపు మదన్‌రెడ్డికి వయోభారంతో శరీరం సహకరించటంలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇలా పలు కారణాలతో మదన్‌రెడ్డికి బదులు సునీతారెడ్డికి టికెట్ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఆ హామీతోనే సునీత చేరిక..
మాజీ మంత్రి సునీతారెడ్డి 2019లో కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ సమయంలో 2023లో టికెట్ ఇవ్వాలనే స్పష్టమైన హామీ తీసుకున్నారని, సునీతకే టికెట్ వస్తుందని ఆమె అనుచరులు ధీమా తో ఉన్నారు. మీడియాలో కూడా సునీతకే టిక్కెట్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని చెబుతున్నారు.
మెదక్‌లోనూ ఆసక్తికర చర్చ..
బీఆర్‌ఎస్ మొదటి విడత జాబితా ఇదేనంటూ పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై మెదక్‌లో చర్చ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పేరు లేకపోవడం ఆమె అనుయాయులను విస్మయానికి గురిచేస్తోంది. మరోవైపు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు డాక్టర్ రోహిత్ మెదక్ టికెట్‌కు పోటీ పడుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే నియోజకవర్గంలో స్వచ్ఛంద కార్యక్రమాలు, ప్రభుత్వ పాఠశాలలను మరమ్మతు, గిరిజన తండాల్లో బోర్ల ఏర్పాటు, బాధితులు, అనాథలకు సాయం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఓ దశలో మెదక్ టికెట్ మైనంపల్లి రోహిత్‌కేనని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మీడియాలో వచ్చిన లిస్ట్‌లో పద్మాదేవేందర్‌రెడ్డి పేరు రాలేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఇప్పటికే మెదక్ బరిలో ఉంటానని ఇటీవల ఓ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ సుభాశ్ రెడ్డి ప్రకటించారు. కాగా సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారెడ్డి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ ప్రజల మధ్య ఉంటున్నారు. దీంతో బీఆర్‌ఎస్ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందో, ఎవరు తుది పోరులో ఉంటారనే విషయం మరికొద్ది రోజుల్లో తెలియనుంది.
సీఎంను కలుస్తా..
నర్సాపూర్ టికెట్ తనకే వస్తుందనే నమ్మకం ఉందని, సోషల్‌మీడియాలో వార్తలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే మాట్లాడతానని మదన్‌రెడ్డి తన అనుచరులతో చెప్పినట్లు తెలిసింది. టికెట్ తనదేనని మూడో సారి ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధిస్తానన్న విశ్వాసంతో ఉన్నారు. బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుల్లో మదన్‌రెడ్డి ఒకరని, టీడీపీలో ఉన్నప్పటి నుంచి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడని, ఆయకే నర్సాపూర్ టికెట్ వస్తుందని అనుచరులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment