ఒక భాషలో హిట్టయిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ కావడం చూస్తూనే ఉంటాం. ఈ ధోరణి ఇప్పుడు వెబ్ సిరీస్‌ల విషయంలోనూ కనిపిస్తోంది. హిట్ వెబ్ సిరీస్‌లు ఇతర భాషల్లోకి రీమేక్ అవుతున్నాయి. వెబ్ తెరపై వ్యూయర్స్‌ను ఎట్రాక్ట్ చేసేందుకు ఇంగ్లిష్ కథలను మన భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఈ ఇంగ్లిష్ కథల్లో నటిస్తున్న ఇండియన్ తారలెవరో చూద్దాం.
వెంకటేశ్ కెరీర్‌లో దాదాపు పాతిక రీమేక్ సినిమాలు ఉంటాయనడంలో సందేహం లేదు. ఇప్పుడు వెంకీ వెబ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తొలిసారి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ చేశారు. అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డోనోవన్’ అనే వెబ్ సిరీస్‌కి అడాప్షన్ ఈ ‘రానా నాయుడు’. అంటే.. రీమేక్. ఈ వెబ్ సిరీస్‌లో వెంకటేశ్‌తో పాటు రానా, ప్రియా బెనర్జీ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ ద్వయం దర్శకత్వం వహించారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ ఏడాదే స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
ఇక ‘రే డోనోవన్’ కథ విషయానికి వస్తే... బడా వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, స్పోర్ట్స్ పర్సన్స్ వంటి వారికి ఎదురైన సమస్యలను పరిష్కరిస్తుంటాడో వ్యక్తి. కానీ తన కుటుంబ సభ్యులు ఎవరైనా సెలబ్రిటీలకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే వాటి జోలికి మాత్రం వెళ్లడు. కుటుంబసభ్యులతో అతనికి ఎటువంటి భేదాభిప్రాయాలు వచ్చాయి? అతని కుటుంబ సభ్యుల్లో ఎవరైనా జైలుకు వెళ్లారా? అనే అంశాల నేపథ్యంలో సాగుతుందీ వెబ్ సిరీస్. ఈ సిరీస్‌కి రీమేక్‌గా వస్తున్న ‘రానా నాయుడు’ ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది.
మరోవైపు బ్రిటిష్ వెబ్ సిరీస్ ‘ప్రెస్’ అడాప్షన్ ‘ది బ్రోకెన్ న్యూస్’లో నటించారు సోనాలీ బెంద్రే. క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన తర్వాత సోనాలీ మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చింది ఈ వెబ్ సిరీస్ కోసమే. వినయ్ వైకుల్ డైరెక్ట్ చేసిన ‘ది బ్రోకెన్ న్యూస్’లో సోనాలీతో పాటు జైదీప్ అహ్లావత్, శ్రియా పిల్గొన్కర్ ప్రధాన పాత్రధారులు. ఈ సిరీస్‌లో అమీనా ఖురేషీ పాత్రలో కనిపిస్తారు సోనాలి. స్క్రిప్ట్ ప్రకారం.. ముంబైలో ‘ఆవాజ్ భారత్’, ‘జోష్ 24/7’ అనే రెండు న్యూస్ చానల్స్ ఉంటాయి. ‘ఆవాజ్ భారత్’ చానెల్ హెడ్‌గా ఉంటారు అమీనా. ఈ రెండు న్యూస్ చానెల్స్ టీఆర్‌పీ రేటింగ్ కోసం ఎలా పోటీ పడ్డాయి? టీఆర్‌పీని పెంచే క్రమంలో ఈ న్యూస్ చానెల్స్‌లోని సీనియర్ ఉద్యోగులు ఎలాంటి ఒత్తిడికి లోనయ్యారు? వాటి పరిణామాలు, పరిస్థితుల సమాహారంగా ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. ‘ది బ్రోకెన్ న్యూస్’ ఈ నెల 10 నుంచి జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
అలాగే బ్రిటిష్ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ హిందీ అడాప్షన్‌లో నటిస్తున్నారు బాలీవుడ్ హీరో ఆదిత్యారాయ్ కపూర్. సందీప్ మోడి దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో శోభితా ధూళిపాళ్ల, అనిల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రధారులు. ఆర్మీలో పని చేసిన అనుభవం ఉన్న ఓ వ్యక్తి ఒక ప్రముఖ హోటల్‌లో నైట్ మేనేజర్ డ్యూటీ చేస్తుంటాడు. ఇదే సమయంలో వ్యాపారవేత్త ముసుగులో చట్టవిరుద్ధంగా ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తుంటాడు మరో వ్యక్తి. ఈ వ్యాపారవేత్తను గమనించేందుకు ప్రభుత్వం కూడా అతని కదలికలపై ఓ స్పై టీమ్‌ను నియమిస్తుంది. ఇదే సమయంలో నైట్ మేనేజర్‌తో పరిచయం ఉన్న ఓ యువతి హత్యకు గురవుతుంది? ఈ హత్యకు కారకులు ఎవరు? ఆమెను ఎందుకు హత్య చేశారు. స్పై టీమ్‌కు, నైట్ మేనేజర్‌కు ఏమైనా సంబంధం ఉందా? అనే అంశాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. నిజానికి ఇందులో హృతిక్ రోషన్ చేయాల్సింది కానీ ఫైనల్‌గా ఆదిత్యా రాయ్ చేతికి వచ్చి చేరింది. పైన పేర్కొన్న వెబ్ సిరీస్‌లే కాదు.. మరికొన్ని హాలీవుడ్ సిరీస్‌లు రీమేక్ కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment