‘సినిమాల్లో హింస, అశ్లీలతలవంటివి చూపించడాన్ని తగ్గించాలి. సినిమాల ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉంటుంది. ప్రజల్లో బాధ్యత పెంపొందించే విధంగా సినిమాలు ఉండాలి. భారతదేశ సినీ పరిశ్రమలో ఉన్న అపారమైన నైపుణ్యానికి ఈ అవార్డులు ఓ మచ్చుతునక మాత్రమే. మరింతమంది ఔత్సాహిక యువ దర్శకులు, కళాకారులు, సాంకేతిక సిబ్బందిని చిత్రపరిశ్రమ పెద్దలు ప్రోత్సహించాలి. సినీరంగంలో అవకాశాలు వెతుక్కుంటున్న యువకులకు రజనీకాంత్ సినీ జీవితం ప్రేరణాత్మకంగా నిలుస్తుంది’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 67వ జాతీయ సినిమా అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంతో పాటు పలువురు కళాకారులకు వెంకయ్యనాయుడు అవార్డులను ప్రదానం చేశారు.
తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’ ఎంపిక కాగా ఆ చిత్రదర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత ‘దిల్’ రాజు అవార్డులు స్వీకరించారు. తెలుగులో ఉత్తమ సినిమాగా ఎంపి కైన ‘జెర్సీ’ అవార్డును నిర్మాత సూర్యదేవర నాగవంశీ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, అదే సినిమాకుగాను ఎడిటర్ నవీన్ నూలి అవార్డు అందుకున్నారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ‘భోంస్లే’కి మనోజ్ బాజ్‌పాయ్, ‘అసురన్ ’ చిత్రానికి ధనుష్ ఇద్దరూ అందుకున్నారు. ‘మణికర్ణిక’, ‘పంగా’ చిత్రాలకుగాను కంగనా రనౌత్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు.
నన్ను నటుడిగా తీర్చిదిద్దిన నా గురువు బాలచందర్‌గారికి ధన్యవాదాలు. నా అన్నయ్య సత్యనారాయణరావు గైక్వాడ్ నా తండ్రిలాంటివారు. గొప్ప విలువలు నేర్పించిన ఆయనకు ధన్యవాదాలు. నా మిత్రుడు, డ్రైవర్, ట్రాన్స్‌పోర్ట్ సహోద్యోగి రాజ్ బహుదూర్ నాలో నటుడు ఉన్నాడని గుర్తించి, నన్ను ప్రోత్సహించారు. వీరితో పాటు నా సినిమా నిర్మాతలు, దర్శకులు, సహ నటీనటులు, సాంకేతిక నిపుణులు, పంపిణీదారులు, థియేటర్ల యజమానులు, మీడియా మిత్రులు, అభిమానులు, తమిళ ప్రజలకి ఈ పురస్కారాన్ని అంకితమిస్తున్నాను.
– రజనీకాంత్
మంచి చిత్రాలు తీస్తూ ఉండాలని ఈ పురస్కారం గుర్తు చేస్తూ ఉంటుంది. వినోదంతో పాటు సందేశం ఇవ్వడం సినిమాతో సాధ్యమవుతుంది. మహేశ్‌బాబు లాంటి సూపర్ స్టార్‌తో సినిమా చేసినప్పుడు మరింతమంది చూస్తారు.
– వంశీ పైడిపల్లి
రైతులకు నగర ప్రజలు ఏ విధంగా సాయం చేయాలనే అంశంతో ‘మహర్షి’ సినిమా తీశాం. మహేశ్ బాబు కమర్షియల్ స్టార్. ఆయనకు తగ్గట్టు సినిమాలో పాటలు, ఫైట్లతో దర్శకుడు వంశీ పైడిపల్లి చక్కటి సినిమా తీశాడు.
– ‘దిల్’ రాజు
‘జెర్సీ’కి పని చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ అవార్డు రావడానికి ముఖ్యకారణం హీరో నానీ.
– గౌతమ్ తిన్ననూరి – నవీన్ నూలి – సూర్యదేవర నాగవంశీ
నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బాబాయి(చినబాబు), డైరెక్టర్‌కు ధన్యవాదాలు. కథను నమ్మి నటించిన నానీకి ప్రత్యేక ధన్యవాదాలు.
– సూర్యదేవర నాగవంశీ
ఎడిటింగ్‌లో చాలా సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాకు అవార్డు రావడం సంతోషంగా ఉంది.
– నవీన్ నూలి
అవార్డు విజేతల వివరాలు..
ఉత్తమ చిత్రం: ‘మరక్కర్: ది అరేబియన్ కడలింటె సింహం’ (మలయాళం)
ఉత్తమ నటుడు: ధనుష్ (‘అసురన్’), మనోజ్ బాజ్‌పాయ్ (‘భోంస్లే’),
ఉత్తమ నటి: కంగనా రనౌత్ (మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ, పంగా)
ఉత్తమ సహాయ నటుడు: విజయ్ సేతుపతి (తమిళ ‘సూపర్ డీలక్స్’)
ఉత్తమ సహాయ నటి: పల్లవీ జోషి (హిందీ ‘తాష్కెంట్ ఫైల్స్’)
ఉత్తమ బాల నటుడు: నాగ విశాల్ (తమిళ చిత్రం – ‘కె.డి’)
ఉత్తమ దర్శకుడు: సంజయ్ పూరణ్ సింగ్ చౌహాన్ (హిందీ ‘బహత్తర్ హూరేన్ ’)
ఉత్తమ వినోదాత్మక చిత్రం: ‘మహర్షి’
ఉత్తమ తెలుగు చిత్రం: ‘జెర్సీ’
ఎడిటింగ్: నవీన్ నూలి (జెర్సీ)
కొరియోగ్రాఫర్: రాజుసుందరం (మహర్షి)
ఉత్తమ సంగీత దర్శకుడు: డి. ఇమాన్ (తమిళ చిత్రం ‘విశ్వాసం’)
ఉత్తమ గాయకుడు: బి. ప్రాక్ (హిందీ ‘కేసరి’)
ఉత్తమ గాయని: సావనీ రవీంద్ర (మరాఠీ ‘బర్దో’)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: గిరీశ్ గంగాధరన్ (మలయాళ చిత్రం – ‘జల్లికట్టు’)
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్: విక్రమ్ మోర్ (కన్నడ ‘అవనే శ్రీమన్నారాయణ’)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: సిద్ధార్థ్ ప్రియదర్శన్ (మలయాళ ‘మరక్కర్: ది అరేబియన్ ’)
ఉత్తమ కాస్ట్యూమ్స్: సుజిత్ సుధాకరన్, వి. సాయి (‘మరక్కర్...’)
ఉత్తమ తమిళ చిత్రం: ‘అసురన్ ’
ఉత్తమ మలయాళ చిత్రం: ‘కల్ల నోట్టమ్’
ఉత్తమ కన్నడ చిత్రం: ‘అక్షి’
ఉత్తమ హిందీ చిత్రం: ‘ఛిఛోరే’
ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం: ‘తాజ్‌మహల్’ (మరాఠీ)
స్పెషల్ జ్యూరీ అవార్డు: ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’ (తమిళం)
చదవండి: అరాచకంగా ‘అన్నాత్తే’ టీజర్.. వింటేజ్ రజనీ ఆన్ ది వే
Comments
Please login to add a commentAdd a comment