హేమ కమిటీ ఇచ్చిన నివేదిక మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు నటీమణులు బహిరంగంగా తమకెదురైన వేధింపులను బయటపెడుతున్నారు. దీంతో మలయాళ మూవీ ఆర్టిస్ట్‌ల సంఘం(అమ్మా)పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ నివేదికపై స్పందించారు. ఈ విషయంలో అమ్మా పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సినీ పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఇండస్ట్రీని ప్రక్షాళన చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని డిమాండ్ చేశారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. "హేమ కమిటీతో మాట్లాడిన మొదటి వ్యక్తిని నేను. సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. వారికి సురక్షితమైన పనివాతావరణం సృష్టించే మార్గాలను కనిపెట్టడమే ఈ నివేదిక లక్ష్యం. హేమ కమిటీ నివేదిక తనకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదు. ఆ ఆరోపణలు నిజమని రుజువైతే ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలని అందరిలాగే నేను కూడా ఆసక్తిగా ఉన్నా. నివేదికలో పేర్కొన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దోషులను కఠినంగా శిక్షించాలి. అదే విధంగా ఆరోపణలు తప్పు అని రుజువైతే తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిని కూడా శిక్షించాల్సిందేనంటూ' సలార్ నటుడు కోరారు. ఈ విషయంలో నిందితుల పేర్లను విడుదల చేయాలనే నిర్ణయం కమిటీ సభ్యులదేనని స్పష్టం చేశారు.
కాగా.. ఈ ఏడాది ఆడుజీవితం (ది గోట్ లైఫ్) మూవీతో సూపర్‌హిట్‌ను సొంతం చేసుకున్నారు. దుబాయ్ నేపథ్యంలో ఓ యధార్థం కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అంతకుముందు సలార్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ తనదైన నటనతో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment