నటుడు రెహమాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో సుమారు 300 పైగా చిత్రాల్లో నటించి బహుభాషా నటుడిగా గుర్తింపు పొందారు. తాజాగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే అమితాబచ్చన్‌తో కలిసి నటించడం విశేషం. ఇకపోతే ఈయన నటుడిగా నాలుగు వసంతాలు పూర్తి చేసుకోవడం మరో విశేషం. కళాశాల విద్య పూర్తి కాగానే ఎలాంటి ప్రయత్నం చేయకుండానే సినిమాలో కథానాయకుడిగా నటించే అవకాశం వరించింది. అలా 1983లో కూడే వీడే అనే మలయాళ చిత్రంతో రెహమాన్ తన నట జీవితానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత నటుడిగా ఆయనకు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు.
తమిళంలోనూ కె. బాలచందర్, సురేష్ కృష్ణ వంటి పలువురు ప్రముఖ దర్శకుల చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. అదేవిధంగా తెలుగులో రాగలీల అనే చిత్రంతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చి మన్మథ సామ్రాజ్యం, చిన్నారి స్నేహం, భార్యలు జాగ్రత్త ,భారత్ బంద్ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. విశేషమేమిటంటే మణిరత్నం దర్శకత్వం వహించిన చారిత్రక కథా చిత్రం పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో మధురాంతకన్ రాజాగా నటించి ఆ పాత్రకు హుందాతనం చేకూర్చారు.
ఇకపోతే ఈయన కథానాయకుడిగా నటించిన సమరా చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. తాజాగా గణపథ్ అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌లో రంగ ప్రవేశం చేశారు. ఈయన ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో అమితాబచ్చన్ ముఖ్యపాత్రను పోషించడం విశేషం. ఇది ఈనెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నటుడు రెహమాన్ శనివారం సాయంత్రం చైన్నెలో విలేకరులతో ముచ్చటించారు.
అమితాబచ్చన్‌తో కలిసి ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఇందులో తన గెటప్ చాలా కొత్తగా ఉంటుందని బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌తో భారీ ఫైట్ సన్నివేశాల్లో పోటీపడి నటించినట్లు చెప్పారు. కాక తనకు దర్శకత్వం చేయాలనే ఆలోచన కూడా వచ్చిందన్నారు. ఈమేరకు కథను కూడా సిద్ధం చేసుకుని ఈడెన్ గార్డెన్ అనే టైటిల్ ను కూడా నిర్ణయించినట్లు చెప్పారు. అయితే నటుడిగా పేరుప్రతిష్టలు, డబ్బు వస్తుంటే ఇప్పుడు దర్శకత్వం ఎందుకని తన భార్య చెప్పడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు రెహమాన్ తెలిపారు.
చదవండి: బిగ్‌బాస్ నుంచి శివాజీ ఔట్.. మళ్లీ వచ్చే ఛాన్స్ ఉందా?
Comments
Please login to add a commentAdd a comment