బుల్లితెర నటుడిగా కెరీర్ ఆరంభించిన బాలీవుడ్ నటుడు విశ్వజిత్ ప్రదాన్ పలు సీరియల్స్‌లో నటించాడు. కెరీర్ ప్రారంభంలోనే సినిమా ఛాన్సులు రావడంతో బుల్లితెరను దూరం పెట్టాడు. అయితే అదే తాను చేసిన పొరపాటని చెప్తున్నాడు విశ్వజిత్. '1989లో ఫౌజీ సీరియల్‌తో నా కెరీర్ మొదలైంది. అది నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. నా నటనను మెచ్చిన ఫిరోజ్ ఖాన్.. 'యల్గార్(1992)' సినిమాలో అవకాశం ఇచ్చాడు. అప్పట్లో సీరియల్ యాక్టర్స్ అంటే చిన్నచూపు ఉండేది.
అందరిలాగే నేను కూడా అదే నిజమనుకుని పొరబడ్డాను. మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ వాటిని తిరస్కరిస్తూ రెండు దశాబ్దాల పాటు టీవీకి దూరమయ్యాను. మరోవైపు చేతి నిండా సినిమాలతో బిజీ అయ్యాను. 2010లో మర్యాదతో మళ్లీ బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చాను. అప్పుడే నేను చేసిన తప్పు తెలుసుకున్నాను. మాలాంటి విలన్లకు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు సినిమా అనగానే చాలు మనసు ఉవ్విళ్లూరుతుంది. కానీ పెద్ద హీరోల సినిమాల్లో చేసినప్పుడు మనకు పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రలే దక్కుతాయి.
అందులోనూ ఎడిటింగ్‌లో మనం నటించిన సన్నివేశాలు కూడా ఎగిరిపోవచ్చు. కొన్నిసార్లైతే ఆ సినిమా వర్కవుట్ కాకపోవచ్చు. కానీ టీవీలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఒక్కసారి నువ్వు ఏదైనా పాత్ర చేశావంటే అది అందరూ గుర్తిస్తారు. ఓటీటీ వచ్చాక మాలాంటి నటుల పరిస్థితి కొంత మెరుగైంది. ఆర్య వెబ్ సిరీస్ వల్ల నటుడిగా నాకు మరింత గుర్తింపు లభించింది' అని చెప్పుకొచ్చాడు. విశ్వజిత్ ప్రస్తుతం సినిమాలతో పాటు శివశక్తి అనే సీరియల్‌లో దక్షుడిగా నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment