‘ఊర్వసివో రాక్షసివో సినిమా చూసినవాళ్లంతా అను ఇమ్మాన్యుయేల్‌తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని చెబుతున్నారు. దానికి ప్రధాన కారణం సెట్స్‌కి వెళ్లడానికి ముందు మేం చేసిన ముందస్తు సన్నాహాలే. రొమాంటిక్ సన్నివేశాల్లో మాలో ఎలాంటి సందేహాలు లేవు. వీటికి కవితాత్మకంగా తెరపై చూపించామే తప్ప ఎక్కడా అసభ్యంగా చూపించలేదు’అని అల్లు శిరీష్ అన్నారు. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. తమిళ్ సూపర్ హిట్ ‘ప్యార్ ప్రేమ కాదల్’కి రీమేక్‌గా వచ్చిన చిత్రమిది. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 4న విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ శనివారం మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు..
► కథ బాగా నచ్చితే తప్ప సినిమా చేయను. అందుకే సినిమా సినిమాకి గ్యాప్ ఎక్కువ ఉంటుంది. రాకేశ్ శశి గతంలో నాకు రెండు మూడు కథలు చెప్పాడు. కానీ అవి వర్కౌట్ కాలేదు. చివరకు ఊర్వశివో రాక్షసివో చిత్రంలో మా కాంబినేషన్ సెట్ అయింది.
► ఈ సినిమా పట్టాలెక్కడానికి ప్రధాన కారణం మా నాన్న(అల్లు అరవింద్). ‘ప్యార్ ప్రేమ కాదల్’ ఆయనకి బాగా నచ్చింది. ఈ సినిమా బాగుంది..నీకు సెట్ అవుతుందని నాతో చెప్పాడు. దాంతో నేను కూడా ఆ సినిమా చూశా. నాకు కూడా బాగా నచ్చింది. మాతృకకు మరింత కామెడిని యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.
► సినిమా చూసిన వాళ్లంతా మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీకుమార్ పాత్రలో ఒదిగిపోయావంటూ అభినందిస్తున్నారు. అయితే ఆ పాత్ర చేయడానికి టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ సింధూజ పాత్రలో అనుని తప్ప మరొకరిని ఊహించలేం. ఆ పాత్రలాగే మొండితనం ఉన్న అమ్మాయి అను. అందుకే సింధూజ పాత్రలో ఒదిగిపోయింది.
► నాకు వివాహ వ్యవస్థపై నమ్మకం ఉంది. సహజీవనంతో ప్రయాణం మొదలు పెట్టి పెళ్లి చేసుకోవాడన్ని ఇష్టపడతా. నా పెళ్లి విషయంలో ఇంట్లో ఒత్తిడేమి లేదు. పెళ్లనేది కూడా హిట్ సినిమా లాంటిదే. దానంతట అదే రావాలి తప్ప మనం అనుకుంటే రాదు(నవ్వుతూ..)
► రొమాంటిక్ కామెడీ సినిమాలకు ఇదివరకు ఓ మార్కెట్ ఉండేది. ఇప్పుడది ఓటీటీ జోనర్ అయింది. సింపుల్ డ్రామాలు, పాత్ర ప్రధానమైన కథలు ఓటీటీల్లోనే చూస్తున్నారు. ‘కాంతార’ తరహా చిత్రాలు, స్టార్ హీరోల సినిమాలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పిస్తున్నాయి. ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment