ఇంతవరకు నేను అన్ని సినిమాల్లోనూ పక్కింటి అమ్మాయిలా నటించాను. కానీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో రత్నమాల అనే ఓ డిఫరెంట్ రోల్‌లో నటించాను. ఆహార్యం, నేను పలికే సంభాషణలు కొత్తగా ఉంటాయి. మనసులో ఏది అనుకుంటే అది బయటకు చెప్పే పాత్ర. లుక్స్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాను. రత్నమాల నా సినీ కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది’ అని అన్నారు తెలుగు బ్యూటీ అంజలి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మే 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా అంజలి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
⇢ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో రత్నమాల అనే మాస్ పాత్ర చేశాను. అలాంటి పాత్ర చేయడం, ఈ తరహా సంభాషణలు నా నోటి నుంచి రావడం ఇదే మొదటిసారి. అసలు ఈ సంభాషణలు నిజంగా సినిమాలో ఉంచుతారా అనుకున్నాను. చిత్రీకరణ, డబ్బింగ్ సమయంలో కొత్త అనుభూతిని పొందాను.
⇢ కృష్ణ చైతన్య మొదటిసారి కలిసి ఈ కథ చెప్పినప్పుడు.. ఈ పాత్రకు నన్ను ఎంపిక చేయడానికి కారణం ఏంటని అడిగాను. ఎందుకంటే నన్ను ఎక్కువగా అందరూ పక్కింటి అమ్మాయి తరహా పాత్రలలో చూడాలి అనుకుంటారు. కానీ ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. అయితే చైతన్య ఏమన్నారంటే.. నాకు అద్భుతంగా నటించే నటి కావాలి, అందుకే మీ దగ్గరకు వచ్చాను, మీరు ఈ పాత్రకు న్యాయం చేయగలరు అన్నారు. ఆయన ఏ నమ్మకంతో చెప్పారో తెలియదు కానీ.. ఇంత మంచి పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది.
⇢ ఈ సినిమాలో విశ్వక్ సేన్, నా పాత్రల బంధం స్వీట్ గా ఉంటుంది. మా పాత్రల పేర్లు కూడా ఒకేలా ఉంటాయి. ఆయన రత్నాకర్, నేను రత్నమాల. ఇద్దరినీ రత్న అని పిలుస్తారు.
⇢ రత్నమాల తరహా పాత్రలు నిజ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తారసపడతాయి. నేను అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు చూశాను. దేనిని లెక్క చేయకుండా పైకి రఫ్ గా కనిపిస్తారు.. కానీ వాళ్ళ మనసు మాత్రం చాలా మంచిది. రత్నమాల పాత్రలోకి వెళ్ళడానికి కాస్త సమయం తీసుకున్నాను. లుక్స్ పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాను.
⇢ విశ్వక్ నాకు ముందు నుంచి స్నేహితుడు. అందుకే మా మధ్య సెట్ లో మంచి సమన్వయం ఉంటుంది. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు కాబట్టి.. ఎటువంటి సన్నివేశాల్లోనూ మేము నటించడానికి ఇబ్బంది పడలేదు.
⇢ దర్శకుడు కృష్ణ చైతన్య మాకు ఏం చెప్పారో అదే తీశారు. ఒక దర్శకుడు ఏం ఆలోచించాడో.. దానిని అలాగే తెరమీదకు తీసుకురావడం అనేది చాలా మంచి లక్షణం. కృష్ణ చైతన్య ఏదైతే రాసుకున్నారో.. దానిని ఇంకా మెరుగ్గా తెరమీదకు తీసుకొచ్చారు.
⇢ ప్రస్తుతం తెలుగులో గేమ్ చేంజర్‌తో పాటు తమిళంలో మూడు సినిమాలు, అలాగే మలయాళ సినిమాలు కూడా చేస్తున్నాను.
⇢ పెళ్ళి అయితే ఖచ్చితంగా చేసుకుంటాను. కానీ ఇప్పుడు కాదు. నా పెళ్ళికి ఇంకా సమయం ఉంది. కొంతకాలంగా నా పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ పుకార్లే.
Comments
Please login to add a commentAdd a comment