ప్రేమకు పెళ్లితో పనేంటి? అవును, మీరు విన్నది నిజమే.. ప్రేమకు పెళ్లితో పనేంటి? అంటున్నారు బాలీవుడ్ లవ్ బర్డ్స్ అర్జున్ రాంపాల్- గాబ్రెల్లా డెమట్రేడ్స్. ప్రేమించుకున్నాం, మాకు నచ్చినట్లుగా కలిసి జీవిస్తున్నాం.. ఇంకేంకావాలి? పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అని ముందుకు సాగుతున్నారు. నాలుగున్నరేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంటకు ఓ బాబు సంతానం కాగా ప్రస్తుతం గాబ్రెల్లా రెండోసారి గర్భం దాల్చింది. అయితే పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవిస్తున్న ఈ జంటపై కొందరు నెటిజన్లు అదేపనిగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో తనను టార్గెట్ చేసిన ఓ నెటిజన్‌కు చురకలేసింది నటి.
తాజాగా గాబ్రెల్లా వీకెండ్ అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బేబీ బంప్ పిక్ కూడా ఉంది. ఇది చూసిన ఓ నెటిజన్.. 'మీరు ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? మీరు మీ దేశంలో లేరు ఇండియాలో ఉన్నారు. మీరిద్దరూ కలిసి యూత్‌ను చెడగొడుతున్నారు' అని కామెంట్ చేశాడు. దీనికి గాబ్రెల్లా స్పందిస్తూ.. 'అవును నిజమే, నీలాంటి మూర్ఖులకు బదులుగా అందమైన చిన్నారిని ఈ లోకంలోకి తీసుకువస్తుండటమే మేము చేసిన తప్పు' అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.
కాగా అర్జున్ రాంపాల్ గతంలో మెహర్ జెసియాను పెళ్లి చేసుకున్నాడు. 1998లో భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని ఆరంభించిన వీరిద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. తర్వాత వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2018లో విడిపోతున్నట్లు ప్రకటించారు. 2019లో విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది గాబ్రెల్లాను తన ప్రేయసి అంటూ అభిమానులకు పరిచయం చేశాడు, అది కూడా తను గర్భం దాల్చిందన్న వార్తతో!
Comments
Please login to add a commentAdd a comment