తనదైన బాడీ లాంగ్వేజీతో, తెలంగాణ యాసలో డైలాగులు పలికిస్తూ నవ్వించగల వ్యక్తి కర్తానందం. జబర్దస్త్ స్టేజీపై కమెడియన్‌గా సత్తా చాటిన ఆయన వెండితెరపై కూడా నటుడిగా రాణిస్తున్నాడు. ఇటీవల వచ్చిన బలగం, దసరా సినిమాల్లో నటించి మరింతమంది ప్రేక్షకులకు దగ్గరైన ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్తూ కన్నీటిపర్యంతమయ్యాడు.
'మాది సూర్యాపేట. ఖమ్మంలో పదవ తరగతి వరకు చదువుకున్నా. మేము నలుగురు అన్నదమ్ములం, ఒక చెల్లి. చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. మా ఐదుగురిని అమ్మ రెక్కలు ముక్కలు చేసుకుని పోషించింది. తను ఇప్పుడు లేదు, కానీ తన గురించి తలుచుకుంటే కన్నీళ్లాగవు. నేను చిన్నతనం నుంచే నాటకాలు వేసేవాడిని. చదువుకునే వయసులోనే జలగం వెంగళ్రావు చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాలేకపోవడంతో కూలీ పనులు చేశాను. ఎన్నో బాధలు అనుభవించాను. ఈ పరిస్థితుల్లో తాగుడుకు బానిసయ్యాను. ఏ పని చేసినా కలిసిరాలేదు. రోడ్డు పక్కన ఎంగిలి బీడీలు ఏరుకుని తాగాను. ఎందుకు ఈ బతుకు? అనిపించింది. కానీ ఏదో ఒకటి సాధించాలనుకున్నాను. సాయం కోసం మా ఫ్రెండ్స్‌ను ఆశ్రయించాను.
అప్పుడు పోలీస్ శాఖ ప్రతి జిల్లాకు కళాబృందాన్ని ఏర్పాటు చేస్తుందన్న విషయం తెలిసింది. వారు నన్ను ఆ కళాబృందానికి హోంగార్డుగా పనిచేయమన్నారు. 22 సంవత్సరాలు అదే ఉద్యోగం చేసి కొంతకాలం క్రితమే రిటైరయ్యాను. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో వచ్చిన బోలెడన్ని సినిమాల్లో నటించాను. చాకలి ఐలమ్మ సినిమాలో జబర్దస్త్ రాజమౌళితో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారా వేణు టీమ్‌లో చేరాను. దాదాపు 200 ఎపిసోడ్లు చేశాను. నన్ను బుల్లితెరకు పరిచయం చేసిన వేణు బలగం సినిమాలోనూ అవకాశం ఇచ్చాడు. ఆయన నా దేవుడు. ఆయనకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను' అంటూ కంటతడి పెట్టుకున్నాడు కర్తానందం.
Comments
Please login to add a commentAdd a comment