
ఎప్పటిలాగే షణ్ముఖ్, సిరి ఇద్దరే కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. సిరి నాకు పడిపోయావ్ కదా అంటూ ఆమె ఒడిలో తల పెట్టుకుని పులిహోర ముచ్చట్లు మాట్లాడాడు షణ్ను. అయితే సిరి మాత్రం నీకంత సీన్ లేదులే అంటూ గాలి తీసేసింది. తర్వాత బిగ్‌బాస్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిన టాస్కుల్లో మళ్లీ జీవించే అవకాశాన్నిచ్చాడు. అందులో భాగంగా పాత టాస్కులను మరోసారి ప్రవేశపెట్టాడు. మొదటగా బెలూన్లలో గాలిని నింపుతూ వాటిని పగిలిపోయేలా చూడాలన్న టాస్క్ ఇచ్చాడు. ఇందులో షణ్ను గెలవగా దానిపై అనుమానం వ్యక్తం చేశాడు సన్నీ. లేబుల్ లేదు మచ్చా అనే రెండో టాస్కులో స్విమ్మింగ్ పూల్‌లో ఒకవైపున్న టీషర్ట్ వేసుకుని పూల్‌లో దూకి మరోవైపున్న టీ షర్ట్ వేసుకోవాలి. ఇలా ఎవరెక్కువ టీ షర్ట్స్ వేసుకుంటే వారే గెలిచినట్లు. ఈ గేమ్‌లో మానస్, షణ్ముఖ్ పోటీపడగా మానస్ గెలిచాడు.
తర్వాత ఖాళీగా ఉండి ఏం చేయాలో పాలుపోక కాసేపు బంతి గేమ్ ఆడుకున్నారు సన్నీ, శ్రీరామ్, మానస్. ఈ క్రమంలో వారి బంతి హౌస్‌పై పడటంతో దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించారు. ఇంతలో బిగ్‌బాస్ వారి ప్రయత్నాన్ని అడ్డుకుంటూ హౌస్‌లోపలకు వెళ్లమని హెచ్చరించాడు. అంతేకాదు బిగ్‌బాస్ ఇంటిపై ఎక్కాలని ప్రయత్నించడం ఏమాత్రం సహించబడదని వార్నింగ్ ఇచ్చాడు. దీనికి ఫలితంగా మీ ముగ్గురూ కలిసి గార్డెన్ ఏరియాను శుభ్రపరచాలని శిక్ష విధించాడు. దీంతో చచ్చాన్రా దేవుడా అనుకుంటూ శ్రీరామ్, మానస్ అంతా క్లీన్ చేయగా సన్నీ శుభ్రం చేస్తున్నట్లు నటించాడు. అనంతరం ఇంటిసభ్యులందరూ 13 నిమిషాలు లెక్కించాలని మూడో టాస్క్ ఇచ్చాడు. హౌస్‌మేట్స్ అంతా తీక్షణంగా క్షణాలను లెక్కిస్తున్న సమయంలో బిగ్‌బాస్ వారిని డిస్టర్బ్ చేసేందుకు నానారకాలుగా ప్రయత్నించాడు. ఈ గేమ్‌లో షణ్ను, శ్రీరామ్, మానస్, సన్నీ, సిరి వరుసగా ఐదు స్థానాల్లో నిలిచారు. ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన షణ్ను బిర్యానీ గెలుచుకోగా దాన్ని అందరూ ఆరగించారు.
తర్వాత సిరి, షణ్ను ఒకరిగురించి మరొకరు మనసు విప్పి మాట్లాడుకున్నారు. 'నువ్వు కరెక్ట్ అని నమ్మాను, మన రిలేషన్‌కు నేనిచ్చే గౌరవం అది. కొన్నిసార్లు కంట్రోల్ అయ్యాను, ఎందుకనేది బయటకు వెళ్లాక చెప్తాను అని సస్పెన్స్‌లో పెట్టింది సిరి. షణ్ను మాత్రం మనం బాగా కనెక్ట్ అయిపోయాం.. అప్పుడప్పుడు నువ్వు జెన్యూన్ కాదేమో అనిపిస్తుంది, కాకపోతే అది కోపంలో ఉన్నప్పుడు అని పేర్కొన్నాడు. అనంతరం బిగ్‌బాస్ నాలుగో టాస్క్‌లో కొన్ని శబ్ధాలు ప్లే చేయగా అవేంటో రాయాలన్నాడు. ఈ గేమ్‌లో బెకబెకల శబ్ధాన్ని సిరి ఎలుకగా గుర్తించి తప్పులో కాలేయడంతో అందరూ పగలబడి నవ్వారు. ఈ ఛాలెంజ్‌లో శ్రీరామ్ గెలుపొందాడు.
ఐదో టాస్కులో తాళ్లను ఎక్కువసేపు ఆపకుండా కదపాల్సి ఉంటుంది. ఇందులో సిరి, సన్నీ, షణ్ను ఆడగా సన్నీ గెలిచాడు. ఓడిపోయావ్ కదా, మళ్లీ ఆడదామా అంటూ సన్నీ సిరిని సరదాగా ఆటపట్టించాడు, కానీ ఆమెకు ఓడిపోయావన్న మాట అస్సలు నచ్చలేదు. నువ్వే ఓడిపోయావ్, షణ్ను ఒక్కడే కరెక్ట్‌గా ఆడాడని రివర్స్ కౌంటర్ ఇచ్చింది. నేను జోక్‌గా అన్నానని సన్నీ అనగా ఓడిపోయావన్న మాట సరదా కాదని తేల్చి చెప్పింది. మజాక్‌గా అన్నానని సన్నీ ఎంత సర్దిచెప్పినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. తిందాం రమ్మని పిలిచినప్పటికీ రానంటూ మొండిగా ప్రవర్తించింది.
పక్కనోడు గెలిస్తే సహించలేడంటూ ఆవేశంతో ఊగిపోయింది. నాతో జోకులొద్దు అని సన్నీకి వార్నింగ్ ఇచ్చింది. సిరి అరవడంతో సహనం కోల్పోయిన సన్నీ ఆమెను ఇమిటేట్ చేయగా సిరి మరింత ఉడికెత్తిపోయింది. ప్రతిసారి వచ్చి ఇమిటేట్ చేయడమేంటని మండిపడింది. నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? తోపు అని ఫీలవుతున్నావా? అంటూ ఏకిపారేసింది. మాటలు పడింది నేను, మళ్లీ పిజ్జా తిందువు రా అని పిలిస్తే ఎవడొస్తాడు అని చిర్రెత్తిపోయింది. అటు సన్నీ.. మానస్‌తో మాట్లాడుతూ.. ఎప్పుడు ఏ గొడవైనా కూడా నేనే వెళ్తాను, ఇంత ఓవరాక్టింగ్ బ్యాచ్ ఏంట్రా? వెళ్లేముందు నన్ను బ్యాడ్ చేస్తే వాళ్లకు ఏమొస్తదిరా? నువ్వు పెద్ద హీరోవా? అంటే నన్ను ఇష్టపడేవాళ్లకు, నా దునియాల నేను హీరోనే' అని స్పష్టం చేశాడు సన్నీ. మరి వీళ్ల గొడవ ఇలాగే కంటిన్యూ అయిందా? లేదా ఎండ్ కార్డ్ పడిందా? అన్నది రేపటి ఎపిసోడ్‌లో తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment