భక్తి రసాత్మక చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాగే కొన్ని కమర్షియల్ చిత్రాల్లో దేవుడి ప్రస్తావన ఉంటుంది. ప్రస్తుతం భక్తి నేపథ్యంలో, దేవాలయాలు ప్రధానాంశంగా కొన్ని చిత్రాలు రానున్నాయి. ‘కేరాఫ్ టెంపుల్’ అంటూ రానున్న ఆ చిత్రాల్లో కొన్ని ‘పాన్ ఇండియా’ స్థాయిలో విడుదల కానున్నాయి. మరి.. దేవుడు అంటేనే యూనివర్శల్. అన్ని భాషలవారికీ నప్పే కథాంశాలతో రానున్న ఈ చిత్రాల గురించి తెలుసుకుందాం.
ఇటు రామాయణం.. అటు విష్ణుతత్వం
ప్రభాస్ అంటే రెబల్ స్టార్. మాస్ పాత్రల్లోనే దాదాపు చూశాం. అందుకు భిన్నంగా సౌమ్యుడిగా కనిపించనున్నారు ప్రభాస్. ‘ఆదిపురుష్’లో రాముడిగా వెండితెరపై కరుణ కూడా కురిపించబోతున్నారు. ఈ పాత్రను ప్రభాస్ ఎగ్జయిటింగ్‌గా చేశారు. ప్రభాస్‌ని రాముడిగా చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు అంతే ఎగ్జయిటింగ్‌గా ఉన్నారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సీతగా కృతీ సనన్ నటించారు. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో గుల్షన్ కుమార్, టీ సిరీస్ సమర్పణలో భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
ఇక ‘ఆదిపురుష్’తో ఓవైపు శ్రీరాముడి గాథని ప్రేక్షకులకు చెబుతున్న ప్రభాస్.. మరోవైపు విష్ణు తత్వాన్ని కూడా బోధించనున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్ కథానాయికగా నటిస్తున్నారు. తెలుగులో ఆమెకు ఇదే మొదటి చిత్రం. సైన్స్ ఫిక్షన్‌గా రూపొందుతున్న ఈ చిత్రం విష్ణు తత్వం, విష్ణు ఆధునిక అవతారం నేపథ్యంలో సాగుతుందని నిర్మాత అశ్వినీదత్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. భారీ బడ్జెట్‌తో అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.
గుడి కోసం రుద్రకాళేశ్వర్ రెడ్డి
రుద్రకాళేశ్వర్ రెడ్డి ఓ గుడి కోసం పెద్ద మైనింగ్ మాఫి యాకి ఎదురు తిరుగుతాడు. ఒక సామాన్య కుర్రాడు మాఫియాని ఢీ కొనడం అంటే చిన్న విషయం కాదు. మరి గుడిని కాపాడటానికి రుద్రకాళేశ్వర్ ఏం చేశాడు? అనేది ‘ఆదికేశవ’లో చూడాలి. రుద్రకాళేశ్వర్ రెడ్డిగా వైష్ణవ్ తేజ్ నటిస్తున్నారు. మైనింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక ఊర్లో శివుడి గుడి చుట్టూ ఈ చిత్రకథ సాగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ‘ఇంత తవ్వేశారు.. ఆ గుడి జోలికి మాత్రం రాకండయ్యా.. శివుడికి కోపం వస్తే ఊరికి మంచిది కాదు’ అంటూ ఆలయ పూజారి చెప్పే డైలాగ్‌ని బట్టి చూస్తే శివుడు, గుడి చుట్టూ ఈ కథ సాగుతుందని స్పష్టమవుతోంది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, ఎస్. సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
భైరవకోనలో ఏం జరిగింది?
సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వర్షా బొల్లమ్మ, కావ్యా థాపర్ హీరోయిన్లు. సూపర్ నేచురల్ ఫ్యాంటసీ, సస్పెన్స్ థ్రిల్లర్, అడ్వెంచరస్ మూవీగా ‘ఊరు పేరు భైరవకోన’ రూపొందింది. భైరవకోనలోని ఓ గుడి నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తోంది. ‘శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో చెలా మణిలో ఉన్న గరుడ పురాణానికి, ఇప్పటి గరుడ పురాణానికి నాలుగు పేజీలు తగ్గాయి’, ‘గరుడ పురాణంలో మాయమైపోయిన ఆ నాలుగు పేజీలే ఈ భైరవ కోన’ అనే డైలాగ్స్‌తో ఇటీవల ఈ మూవీ టీజర్ విడుదలైంది. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.
అంజనాద్రి కోసం..
‘జాంబిరెడ్డి’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో తేజా సజ్జ– డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘హను–మాన్’. హనుమంతుని శక్తులను పొందిన హీరో హనుమంతుని జన్మస్థలంగా పేర్కొంటున్న అంజనాద్రి కోసం ఎలా పోరాటం చేశాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘హను–మాన్’. ‘‘ఇండియన్ రియల్ సూపర్ హీరో హనుమంతుడి స్ఫూర్తితో అంజనాద్రి అనే ఊహాత్మక ప్రపంచం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. అమృతా అయ్యర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది.
ఇవే కాదు.. మరికొన్ని సినిమాలు కూడా పురాణాలు, దేవాలయాలు, ఇతిహాసాల కథలతో రూపొందుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment