టైటిల్ : తిరు
నటీనటులు : ధనుష్, నిత్యామీనన్, ప్రియా భవానీ శంకర్, రాశీఖన్నా, ప్రకాశ్ రాజ్, భారతీ రాజా తదితరులు
నిర్మాణ సంస్థ : సన్ పిక్చర్స్
నిర్మాతలు: కళానిధి మారన్
దర్శకత్వం: మిత్రన్ ఆర్. జవహర్
సంగీతం : అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాశ్
విడుదల తేది: ఆగస్ట్ 18, 2022
తమిళ స్టార్ హీరో ధనుష్‌కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన తమిళ సినిమాలు చాలా వరకు తెలుగులో డబ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా ధనుష్ లేటెస్ట్ తమిళ్ మూవీ ‘తిరు చిత్రాంబళం’ కూడా తెలుగులో ‘తిరు’ పేరుతో విడుదలైంది. ఎలాంటి ప్రచారం లేకుండా ఈ గురువారం(ఆగస్ట్ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తిరు’ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
తిరు ఏకాంబరం అలియాస్ పండు(ధనుష్) ఓ మధ్య తరగతి యువకుడు. ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ తండ్రి(ప్రకాశ్ రాజ్), తాత సినియర్ తిరు(భారతీ రాజా)లతో కలిసి జీవిస్తుంటాడు. తన జీవితంలో జరిగిన ఓ సంఘటన కారణంగా తండ్రిపై ద్వేషం పెంచుకొని, అతనితో మాట్లాడడమే మానేస్తాడు. అంతేకాదు ఆ సంఘటన కారణంగానే చదువుని మధ్యలో ఆపేసి, భయస్తుడిగా మారిపోతాడు. అతని క్లోజ్ ఫ్రెండ్ శోభన(నిత్యామీనన్). తిరు ఉండే అపార్ట్‌మెంట్ కిందే శోభన ఫ్యామిలీ ఉంటుంది. ఆమెతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు.
శోభన కూడా అని విషయాల్లోనూ తిరుకు తోడుగా ఉంటుంది. తిరు మనసుపడ్డ అమ్మాయిలు అనూష(రాశీఖన్నా), రంజని(ప్రియా భవానీ శంకర్) విషయంలోనూ శోభన సాయం చేస్తుంది. చివరకు తిరు ప్రేమని ఎవరు అంగీకరించారు? ఆయన జీవితంలో జరిగిన సంఘటన ఏంటి? ఎందుకు తండ్రితో మాట్లాడకుండా ఉన్నాడు? తిరులో ఉన్న భయాన్ని ఎలా అధిగమిస్తాడు? తదితర విషయాలు తెలియాలంటే థియేటర్స్‌లో ‘తిరు’సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే...
కుటుంబ అనుభంధాలు, స్నేహం, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘తిరు’. ఈ తరహా కథలు తెలుగు, తమిళ ప్రేక్షకులకు కొత్తేమి కాదు. కానీ కథనాన్నే నేచురల్ సీన్స్‌తో ఆసక్తికరంగా నడిపించడం ‘తిరు’ స్పెషల్. కథ ప్రారంభం, తిరు నేపథ్యం ధనుష్ గతంలో నటించిన ‘రఘువరన్ బి.టెక్’సినిమాను గుర్తు చేస్తుంది. నేపథ్య సంగీతం కూడా అలానే ఉంటుంది. ఇక తిరు, శోభన మధ్య సాగే స్నేహం, ప్రేమ తదితర సీన్స్ ‘నువ్వే కావాలి’సినిమా తరహాలో ఉంటాయి. పండు, శోభన పాత్రలు మాత్రం మనలో ఒకరిగా వ్యవహరిస్తాయి. అంత సహజంగా ఆ పాత్రలను తీర్చి దిద్దాడు దర్శకుడు మిత్రన్ ఆర్. జవహర్.
తిరు, శోభనల మధ్య వచ్చే కొన్ని సీన్స్ నవ్వులు పూయిస్తాయి. తిరు అనూషని ప్రేమించడం, ఆ విషయంలో శోభన సాయం చేడయం తదితర రొటీన్ సీన్స్‌తో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫ్యామిలీ డ్రామా సీన్స్ ఆకట్టుకుంటాయి. అయితే ఆ సన్నివేశాలు మాత్రం సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేవు. అంతేకాదు సెకండాఫ్‌లో కథ ఎలా సాగుతుందనేది కూడా ప్రేక్షకుడు ఊహించవచ్చు.
అయితే పల్లెటూరి నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్స్ కామెడీని పండిస్తాయి. ఇక హీరో తండ్రిని ఎందుకు ద్వేషిస్తున్నాడో చెప్పే ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోవు. క్లైమాక్స్ కూడా సింపుల్ ఉంటుంది. మనం చేసే ఒక చిన్న తప్పు జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది తెరపై చూపించిన తీరు బాగుంది. తెలుగులో ధనుష్‌కి మంచి మార్కెట్ ఉన్నప్పటికీ.. ఇక్కడ ఈ సినిమా ప్రమోషన్స్ చేయపోవడం పెద్ద మైనస్. చాలా మందికి తెలుగులో ‘తిరు’సినిమా విడుదలైన విషయమే తెలియదు.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమా మొత్తం ధనుష్, నితామీనన్ పాత్రల చుట్టే తిరుగుతుంది. ఈ సినిమాకు వారే ప్రధాన బలం. తమదైన సహజ నటనతో ఇద్దరు ఆకట్టుకున్నారు. ప్రతి సీన్‌లో ఇద్దరు పోటాపోటీగా నటించారు. ఒకనొక దశలో ధనుష్‌ని డామినేట్ చేసేలా నిత్యా యాక్టింగ్ ఉంటుంది. ఇద్దరు కూడా తమ తమ పాత్రల్లో నటించడం కంటే జీవించేశారని చెప్పొచ్చు.
ప్రకాశ్ రాజ్ తన పాత్రకు న్యాయం చేశాడు. కానీ ఆయన పాత్రకు వేరే వ్యక్తితో డబ్బింగ్ చెప్పించడం పెద్ద మైనస్. ఇక ఇక్కడ భారతీ రాజా పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సీనయర్ పండు పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. రాశీఖన్నా,ప్రియా భవానీ శంకర్ తదితరులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అనిరుధ్ సంగీతం జస్ట్ ఓకే. గత సినిమాలో పోలిస్తే..ఇందులో పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సింపుల్‌గా ఉంటుంది. ఓంప్రకాశ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment