మొదటి నుంచి వివాదాలతోనే సావాసం చేస్తున్న ఆదిపురుష్ సినిమా మరోసారి విమర్శల్లో చిక్కుకుంది. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ ఓం రౌత్ అక్కడి నుంచి వెళ్లిపోతున్న హీరోయిన్ కృతీ సనన్‌ను హత్తుకుని బుగ్గపై ముద్దుపెట్టి సాగనంపాడు. ఆలయ ప్రాంగణంలో అనుచితంగా ప్రవర్తించిన వీరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
వారు సినిమాతో కనెక్ట్ కాలేరు
తాజాగా ఈ వివాదంపై సీనియర్ నటి దీపిక చిఖిల స్పందించింది. 'ఈ జనరేషన్‌లో ఉన్న నటీనటులతో ఇదే పెద్ద సమస్య. వాళ్లకు ఎలాంటి పాత్రను పోషించాము, అందులో ఎంత లీనమైపోవాలన్నది తెలియదు. కనీసం ఆ పాత్ర ఎమోషన్స్‌ను కూడా పట్టుకోలేరు. అలాంటివారికి రామాయణం అంటే కేవలం ఒక సినిమా మాత్రమే! ఆధ్యాత్మికంగా ఆ సినిమాతో వారు కనెక్ట్ కాలేరు. కృతీ సనన్ కూడా ఈ జనరేషన్ హీరోయినే కదా!
సీత పాత్రలో తరించిపోయా
హగ్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం మంచి సాంప్రదాయం అని ఈ తరం వాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఆదిపురుష్ సినిమా చేసినప్పటికీ ఆమె తనకు తాను సీతగా భావించలేదు. నేను కూడా గతంలో సీత పాత్ర చేశాను. కానీ అందులో జీవించి తరించిపోయాను. ఇప్పటి తరం వాళ్లు కేవలం వాటిని ఒక పాత్రలాగే చూస్తున్నారు. సినిమా అయిపోయాక దాని గురించి ఏమాత్రం పట్టించుకోరు, తన రోల్ అయిపోయిందని ఫీలవుతారు.
మా కాలికి నమస్కరించేవాళ్లు
కానీ అప్పట్లో అలా ఉండేది కాదు. సెట్‌లో కనీసం మా పేరు పెట్టి కూడా పిలిచేవారు కాదు. అలాంటి దేవుళ్ల పాత్రలు చేస్తున్నప్పుడు ఎంతోమంది వచ్చి మా కాలికి నమస్కరించేవారు. మమ్మల్ని నటులుగా కాకుండా నిజమైన దేవుళ్లలాగే భావించేవారు. హగ్గులకు, ముద్దులకు ఆస్కారమే ఉండేది కాదు. ఆదిపురుష్ రిలీజవగానే ఇందులో పని చేసినవాళ్లంతా ఈ సినిమాను మర్చిపోయి మరో ప్రాజెక్ట్‌లో బిజీ అవుతారు. కానీ మా కాలంలో ఇది పూర్తి విరుద్ధంగా ఉండేది.
అలాంటి పనులు చేయలేదు
పైనున్న భగవంతులే ఈ లోకంలోకి వచ్చారన్నంతగా మమ్మల్ని భక్తిపారవశ్యంతో చూసేవారు. అందుకే ప్రజల మనసులు నొప్పించే పనులను మేమెప్పుడూ చేసేవాళ్లమే కాదు' అని చెప్పుకొచ్చింది దీపిక. కాగా ఆమె రామానంద్ సాగర్ డైరెక్ట్ చేసిన రామాయణ్ సీరియల్‌లో సీతగా నటించింది. ఇందులో అరుణ్ గోవిల్ రాముడిగా నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment