
చాలా గ్యాప్ తర్వాత దర్శకుడు వి.గౌతమన్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈయన ఇంతకుముందు కనవే కలయాదే, మగిల్చి వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. మధ్యలో రాజకీయాలకు వెళ్లిన ఈయన సొంతంగా రాజకీయ పార్టీని కూడా ప్రారంభించారు. అలాంటిది చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలపై దృష్టి సారించారు.
ఈయన దర్శకత్వం వహించి కథానాయకుడుగా నటించే చిత్రానికి మావీర అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వాస్తవ సంఘటన నేపథ్యంలో చిత్రాలు చేసే ఈయన తాజాగా పడమినీ, మహిళల గౌరవాభిమానాన్ని కాపాడిన మందిరక్కాడు వీరుడి జీవిత చరిత్ర మావీర పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శత్రువులను తుది ముట్టించాలన్న భావన కంటే వారి మనసులను గెలవడం ముఖ్యమని భావించే కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం ఇదని వి.గౌతమన్ పేర్కొన్నారు.
ఆసక్తికరమైన అంచనాలతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. దీనికి జై ప్రకాష్ కుమార్ సంగీతం, వైరముత్తు పాటలు, వెట్రివేల్ మహేంద్రన్ చాయాగ్రహణం అందించనున్నారని తెలిపారు. వీకే ప్రొడక్షన్స్ పతాకంపై తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు.