
బెంగళూరు: కన్నడ పరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) పోలీసులు నటి రాగిణి ద్వివేదికి సమన్లు జారీ చేశారు. నేడు రాత్రిలోగా సీసీబీ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. కాగా ఈ కేసులో నటి స్నేహితుడు రవిని పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. దర్యాప్తులో నటి రాగిణికి కూడా డ్రగ్స్ వ్యవహారంతో సంబంధాలున్నట్లుగా సంకేతాలు అందడంతో ఆమెను విచారణకు ఆదేశించారు. దీని గురించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు నేడు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. కాగా కన్నడ చిత్రపరిశ్రమలో నటీనటులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను ఆగస్టు 20న ఎన్సీబీ(నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరి డైరీని స్వాధీనం చేసుకోగా అందులో సెలబ్రిటీలు, నటులు, మోడల్స్ లిస్టు పేర్లు రాసి ఉన్నాయి. (చదవండి: సినీ సెలబ్రిటీల గుట్టు బయటపెట్టిన అనికా!)
మరోవైపు ఈ వ్యవహారంలో పాలుపంచుకుంటున్న సెలబ్రిటీల పేర్లు వెల్లడించేందుకు సిద్ధమేనని దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ ప్రకటించడం చర్చంనీయాంశంగా మారింది. దీంతో సీసీబీ అధికారులు ఆయనను పిలిచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. దీనిపై క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ సందీప్ పటేల్ మాట్లాడుతూ.. లంకేశ్‌కు తాము మరోసారి అవకాశం ఇస్తామన్నారు. డ్రగ్స్ కేసులో మరిన్ని వివరాలు అందిస్తే దానికనుగుణంగా సాక్ష్యాలను సేకరిస్తామని తెలిపారు. ఇప్పటికే కొంత మంది పేర్లను కూడా ఆయన బయటపెట్టినట్లు పేర్కొన్నారు. దీన్ని ఆధారంగా చేసుకుని మరికొద్దిమంది నటులకు కూడా నోటీసులు అందించేందుకు సీసీబీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ వ్యవహారంపై బుధవారం సమావేశమైన కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ కేసులో దోషులుగా తేలిన నటులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. (చదవండి: తనను వ్యభిచారిగా చిత్రీకరించి..)
Comments
Please login to add a commentAdd a comment