భారతదేశ స్వాతంత్య్రం కోసం సాగిన బహుముఖ పోరాటాన్ని వివరిస్తూ చరిత్ర, నాటకం యాక్షన్‌లను మిళితం చేస్తూ నిఖిల్ అద్వానీ 'ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్' అందించారు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్‌లో అందుబాటులో ఉంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..
ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ సిరీస్‌లో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ (సిద్ధాంత్ గుప్తా), సర్దార్ వల్లభాయ్ పటేల్ (రాజేంద్ర చావ్లా), మహాత్మా గాంధీ (చిరాగ్ వోహ్రా), లార్డ్ లూయిస్ మౌంట్‌బాటెన్ (ల్యూక్ మెక్‌గిబ్నీ) పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. రాజకీయ కుట్రల సూక్ష్మమైన విశ్లేషణ, వ్యక్తిగత త్యాగాలు, భావోద్వేగ తిరుగుబాట్లు ఆసక్తికరంగా సాగుతాయి.
నెహ్రూ, పటేల్, గాంధీల విభిన్న భావజాలంతో కూడిన సన్నివేశాలతో ఈ సిరీస్ వైవిధ్యభరిత అనుభూతిని అందిస్తుంది. స్వతంత్ర భారతదేశం కోసం పోరాడిన ఈ ముగ్గురివీ.. వేటికవే విభిన్న థృక్కోణాలైనా సమర్థనీయమైనవిగా అనిపిస్తాయి. ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి.
దేశ నిర్మాణం ఆచరణాత్మక డిమాండ్ల మధ్య చిక్కుకున్న నాయకుడి అంతర్గత సంఘర్షణ నెహ్రూ పాత్ర చిత్రణలో తెలుస్తుంది. ముహమ్మద్ అలీ జిన్నాలోని అహం, ఆశయం, తెలివిని నటుడు ఆరిఫ్ జకారియా చక్కగా చూపించాడు. సర్దార్ పటేల్‌గా రాజేంద్ర చావ్లా, లియాఖత్ అలీ ఖాన్‌గా రాజేష్ కుమార్, లార్డ్ లేడీ మౌంట్‌బాటన్‌గా కార్డెలియా బుగేజా మెరుస్తారు. మలిష్కా మెండోన్సా సరోజినీ నాయుడుగా కనిపిస్తారు.
ఈ సిరీస్ 1940ల నాటి భారతదేశానికి అద్దం పట్టింది. పునర్నిర్మించిన వైస్రాయ్ హౌస్ లేదా కాంగ్రెస్ కార్యాలయాలు..ఇలా ప్రతి ఫ్రేమ్ సమగ్ర పరిశోధనను ప్రతిబింబిస్తుంది. కథ, కథనాలను భావోద్వేగభరితంగా అందించటంలో అద్వానీ దర్శకత్వ ప్రతిభ ఆకట్టుకుటుంది.
భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన ఇతర చిత్రీకరణల మాదిరిగా కాకుండా, ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ 1944 - 1947 మధ్య కీలకమైన సంవత్సరాలకు దాని పరిధిని కుదించింది. ఇది గాంధీ–జిన్నా చర్చలు విభజనకు దారితీసిన వంటి సంఘటనలపైనే దృష్టి పెట్టింది. రాజకీయ కుతంత్రాలు, సైద్ధాంతిక వైరుధ్యాలు, తెరవెనుక చర్చలను చక్కగా చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment