టైటిల్ : గమనం
నటీనటులు : శ్రియ సరన్, నిత్యామీనన్, ప్రియాంక జవాల్కర్ , శివ కందుకూరి, బిత్తిరి సత్తి తదితరులు
నిర్మాణ సంస్థ: క్రియా ఫిలిం కార్పొరేషన్, కాళీ ప్రొడక్షన్స్
నిర్మాత : రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు, జ్ఞానశేఖర్ వి.ఎస్
దర్శకత్వం: సుజనా రావు
సంగీతం : ఇళయరాజా
సినిమాటోగ్రఫీ : జ్ఞానశేఖర్ వి.ఎస్
విడుదల తేది : డిసెంబర్ 10, 2021
ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన శ్రియ సరన్.. చాలా రోజులుగా సినిమాలకు గ్యాప్ ఇస్తూ వస్తోంది. కెరీర్‌ని పక్కన పెట్టి పెళ్లి, పిల్లలు.. ఇలా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తుంది. చాలా గ్యాప్ తర్వాత ఆమె ‘గమనం’అనే విభిన్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(డిసెంబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గమనం’మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
‘గమనం’కథేంటంటే..?
సామాజికంగా వెనుకబడిన ముగ్గురి జీవితాల చుట్టూ తిరిగే కథే ‘గమనం’. ఇది హైదరాబాద్ మహానగరంలో మూడు ఏరియాల్లో జరిగే కథ. కలమ(శ్రియ సరన్) ఓ దివ్యంగురాలు. వినికిడి లోపంతో బాధపడుతుంది. ఆమెకు ఓ చిన్న పాప ఉంటుంది. తనకు వినికిడి లోపం ఉందని... భర్త కూడా వదిలేస్తాడు. దాంతో నిస్సహాయురాలిగా ఓ బస్తీలో జీవిస్తూ ఉంటుంది. టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. మరోవైపు అలీ(శివ కందుకూరి) తల్లిదండ్రులను కోల్పోయి.. తాత, నానమ్మలతో కలిసి ఉంటాడు. క్రికెటర్‌గా రాణించాలని, పట్టుదలతో ప్రాక్టీసు చేస్తుంటాడు. అతన్ని ఇంటిపక్కనే ఉండే జరా(ప్రియాంక జవాల్కర్) ప్రేమిస్తుంది. ముస్లిం కుటుంబానికి చెందిన వీరిద్దరి ప్రేమను పెద్దలు ఒప్పుకోరు. దీంతో జరా అలీ కోసం ఇంట్లో నుంచి పారిపోయి వస్తుంది.
ఇంకోవైపు బస్తీలోని ఓ మురికి కాలువ పక్కన ఉండే ఇద్దరు వీధి బాలురు.. చిత్తు కాగితాలు ఏరుకొని జీవనం సాగిస్తుంటారు. వీరిలో ఒకరికి తన పుట్టిన రోజు వేడుకని జరుపుకోవాలని కోరిక పుడుతుంది. కేక్ కోసం డబ్బును జమ చేయాలని డిసైడ్ అవుతారు. చిత్తు కాగితాలు అమ్ముకోగా కొద్దిగా డబ్బు వస్తుంది. అది సరిపోవడం లేదని మట్టి వినాయకుల విగ్రహాలను అమ్మడం స్టార్ట్ చేస్తారు. ఇలా ఈ మూడు పాత్రలు నగరంలో కురిసిన భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకుంటారు. ఆ వరదల్లో నుంచి వీళ్ళు ఎలా బయట పడ్డారు? భారీ వర్షాల కారణంగా కమల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అలీ క్రికెటర్ అయ్యాడా లేదా? అలీ, జరా పెళ్లి జరిగిందా? కేక్ కట్ చేసి గ్రాండ్‌గా పుట్టిన రోజు వేడుకను సెలెబ్రేట్ చేసుకోవాలనే వీధి బాలుర ఆశయం నెరవేరిందా? అనేదే మిగతా కథ.
ఎవరెలా చేశారంటే?
వినికిడి లోపం ఉన్న దివ్యాంగురాలు కమల పాత్రలో శ్రియ ఒదిగిపోయింది. ఇప్పటి వరకు తన గ్లామర్ తోనే ఆడియన్స్ ని అలరించిన శ్రియా.. ఈ మూవీతో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్‌లో చాలా బాగా నటించింది. క్రికెటర్ అవ్వాలని ఆశ పడే ముస్లిం యువకుడు అలీ పాత్రలో శివ కందుకూరి మెప్పించాడు. క్లైమాక్స్‌లో వరదల్లో చిక్కుకున్న చిన్నారులను కాపాడే సీన్స్ లో ఆకట్టుకున్నాడు. అలీని గాఢంగా ప్రేమించే ముస్లిం యువతి జరాగా ప్రియాంక జవాల్కర్ మెప్పించింది. వీధి బాలురుగా నటించిన ఇద్దరు చిన్నారులు అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. రోడ్డు మీద బొమ్మలు అమ్ముకునే పాత్రలో బిత్తిరి సత్తి, అతిథి పాత్రలో నిత్యామీనన్‌లతో పాటు మిగిలిన నటీ, నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఎలా ఉందంటే..?
ఆశయాలు, ఆశలు, ప్రేమ, పేదరికం, ఆకలి, మోసం, పరువు ఇలా మనిషిలోని అనేక భావోద్వేగాల సమాహారమే ‘గమనం’. మూడు భిన్న నేపధ్యాలను ఒక కథగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకురాలు సుజనా రావు. భర్త చేతిలో మోసపోయి... నిరాదరణకు గురైన ఓ దివ్యంగురాలు... ఆటతోనే తన కెరీర్ ను ఉన్నత శిఖరాలకు చేర్చుకోవాలనే ఓ పట్టుదల ఉన్న యువకుడు.. పేదరికంలో మగ్గిపోయే ఇద్దరు వీధి బాలలు.. ఈ ముగ్గురి చుట్టే కథంతా తిరుగుతుంది. తొలి ప్రయత్నంగానే ఇలాంటి కథ ప్రేక్షకులను అందించాలనే దర్శకురాలి ఆలోచనను మనం అభినందించాల్సిందే. అయితే ఆమె ఎంచుకున్న మూల కథ బాగున్నా.. దాన్ని తెరపై చూపించడంలో మాత్రం కాస్త తడబడ్డారు. కొన్ని సన్నివేశాల్లో అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ హైదరాబాద్ లాంటి మహానగరంలో పేదల జీవితాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్లు చూపించారు. అలాగే భారీ వర్షాలు వస్తే బస్తీల్లో పేదల బతుకు ఎలా ఛిద్రం అవుతుందో బాగా చూపించారు.
స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేకపోవడం, కథంతా నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్. ఇళయారాజా నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్. ఈ మూవీలో ఒకటే సిట్యువేషనల్ సాంగ్ ఉంది. అది పర్వాలేదు. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు సినిమాకి తగినట్లుగా ఉన్నాయి. ఈ సినిమాకు ప్రశంసలు ఉంటాయి కానీ కమర్షియల్‌గా విజయం సాధించడం కష్టమనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment