‘‘కోవిడ్ తర్వాత ప్రేక్షకుల అభిరుచి, సినిమాల పరిధి పెరిగింది. ఇప్పుడంతా పాన్ ఇండియా అంటున్నారు. మాది పాన్ ఇండియా మూవీ అని ప్రకటించుకుంటే సరిపోదు. ప్రేక్షకుల మైండ్ సెట్ గమనించాలి. కథ పరంగా మన నేటివిటీకి తగినట్లు సరైన సినిమా తీస్తే తప్పకుండా పాన్ ఇండియా స్థాయికి చేరుతుంది’’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘హ్యాపీ డేస్’ మూవీ 2007లో విడుదలై, హిట్‌గా నిలిచింది. ఆ సినిమాను నేడు రీ రిలీజ్ చేస్తున్నారు. అలాగే శేఖర్ కమ్ముల చిత్ర పరిశ్రమలోకి వచ్చి 25 ఏళ్లవుతోంది. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని శేఖర్ కమ్ముల పంచుకున్న విశేషాలు.
► చిత్ర పరిశ్రమలో 25 సంవత్సరాల ప్రయాణంలో నేను నిలబడడం చూస్తే చాలా గర్వంగా ఉంది. నా తొలి చిత్రం ‘డాలర్ డ్రీమ్స్’ (2000) నుంచి ‘లవ్ స్టోరీ’ (2021) సినిమా వరకూ ఇన్నేళ్ల కెరీర్‌లో ఎక్కడా రాజీ పడకుండా నా విలువలకు తగినట్లు సినిమా తీయడం గొప్పగా అనిపిస్తోంది. నేను ఏ సినిమా చేసినా విలువలు, సిద్ధాంతాలతో తీయాలని, చెడు చెప్పకూడదు అనే ఆలోచనతోనే తీశాను. పేరు, డబ్బు కోసం చిత్ర పరిశ్రమకి రాలేదు. అలాంటి ఆలోచనతో సినిమాలూ తీయలేదు.. అదే నాకు గర్వంగా ఉంది. ఇప్పుడు సినిమా రంగంలో పోకడ చాలా హార్‡్షగా ఉంది.
► ‘హ్యాపీ డేస్’ సినిమా చేస్తున్నప్పుడు నా గ్రాడ్యుయేషన్ పూర్తయి పదేళ్లయింది. అప్పటి పరిస్థితుల రీత్యా ఆ మూవీకి స్టూడెంట్ బ్యాక్‌గ్రౌండ్ చక్కగా కుదిరింది. అయితే నేడు టెక్నాలజీ మారింది. ప్రతి స్టూడెంట్ చేతిలో మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి. కోవిడ్, గ్లోబలైజేషన్ వంటి పరిస్థితుల తర్వాత ఆలోచనా విధానం మారింది. సాంకేతిక పరంగా ఇప్పుడు విద్యార్థులు ఎవరి లోకంలో వారు ఉన్నారు. ‘హ్యాపీ డేస్’ సినిమా విడుదలై ఇన్నేళ్లయినా చాలా ఫ్రెష్‌గా ఉంది. రీ రిలీజ్ కూడా యూత్‌కు ఓ పండగలా ఉంటుందని అనిపించింది. ‘హ్యాపీ డేస్’కి సీక్వెల్ తీయాలనిపించింది.. కానీ, కథ కుదరలేదు.
► ఇన్నేళ్ల నా ప్రయాణంలో పది చిత్రాలు చేశాను. అయితే నా ప్రయాణం నిదానంగా సాగుతోందనుకోవడం లేదు. నేను ఏ సినిమా చేసినా ఈ కథ అవసరమా? అని ఆలోచించి చేస్తాను. నేను సినిమా చేసే పద్ధతి, నా సినిమాలే మాట్లాడతాయి. కాపీ కొట్టే కథలు నేను చేయను. కంటెంట్ పరంగా బాగా, సూటిగా చె΄్పాలనుకుంటాను. మనసులో ఓ ఆలోచన రావడానికి, అది కార్యరూపం దాల్చడానికి సమయం పడుతుంది. అలా కాకుండా వెంట వెంటనే సినిమాలు చేయాలనుకోను.
► నా తొలి చిత్రం ‘డాలర్ డ్రీమ్స్’కి జాతీయ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత నంది అవార్డులతో పాటు మరికొన్ని అవార్డులు కూడా అందుకున్నాను. అయితే మళ్లీ జాతీయ అవార్డు అందుకోవాలనే ఆలోచన లేదు. నేను రాజీపడకుండా సినిమా తీస్తున్నాను.. అందుకే సంతోషంగా ఉన్నాను. నా చిత్రాలకు ప్రేక్షకులు ఇచ్చే అవార్డే గొప్పది. ఒక్కో ఏడాది జాతీయ స్థాయిలో మనకంటే మంచి సినిమాలు వస్తుంటాయి.. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని అవార్డుకి ఎంపిక చేస్తారు. అయితే మంచి కంటెంట్ తీసుకుని ముందుకెళ్లడమే మన పని.
► నా కెరీర్‌లో తొలిసారి నాగార్జున, ధనష్ వంటి స్టార్ హీరోలతో ‘కుబేర’ అనే మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాను. ఈ కథకు వారిద్దరూ సరిపోతారనిపించి చేస్తున్నాను.. అంతేకానీ, పెద్ద ్రపాజెక్ట్, బిగ్ స్కేల్‌లో సినిమా చేయాలనే ఆలోచనతో కాదు. వారిద్దరితో పని చేయడం గొప్ప అనుభూతి. నిర్మాత, దర్శకుడికి మధ్య స్వేచ్ఛ, నమ్మకం అనేది ఉండాలి. అది ఏషియన్ మూవీస్ బేనర్‌లో నాకెక్కువగా ఉంది. ‘లీడర్’ సినిమాకి సీక్వెల్ తీయాలనే ఆలోచన ఉంది. కానీ సమయం కుదరడం లేదు. చేస్తే మాత్రం తప్పకుండా రానాతోనే చేస్తాను.
Comments
Please login to add a commentAdd a comment