Venkatesh Daggubati: Interesting Comments In Movie Promotions, Updates In telugu - Sakshi
Sakshi News home page

Venkatesh Daggubati: చేతిలో ఒక్క సినిమా లేదు, ఖాళీగా ఉన్నా!

Published Thu, Nov 18 2021 9:50 PM | Last Updated on Fri, Nov 19 2021 12:59 PM

Hero Venkatesh Interesting Comments In Movie Promotions - Sakshi

సినిమా హిట్ట‌యితే చాలు.. అది ఏ భాషా చిత్ర‌మ‌యినా స‌రే దిగుమ‌తి చేసుకోవ‌డానికి రెడీగా ఉంటుంది తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌. అలా టాలీవుడ్‌లో రీమేక్ సినిమాల ప‌రంప‌ర ఎక్కువైంది. ముఖ్యంగా విక్ట‌రీ వెంక‌టేశ్ త‌మిళ సినిమాకు జై కొడుతున్నాడు. అక్క‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న దృశ్యం, నార‌ప్ప చిత్రాల‌ను రీమేక్ చేసి హిట్లు అందుకున్నాడు. అత‌డు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన‌ దృశ్యం 2 సినిమా ఈనెల న‌వంబ‌ర్ 25న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ‌వుతోంది. చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా హీరో వెంక‌టేశ్ గురువారం మీడియాతో ముచ్చటిస్తూ సినీ విశేషాల‌ను పంచుకున్నారు. ఆ విశేషాలు..

► ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తాడు రాంబాబు. అది తప్పా.. ఒప్పా అని ఆలోచించడు. తన ఫ్యామిలీని కాపాడుకోవడమే రాం బాబు ముఖ్య ఉద్దేశ్యం. అలాంటి పాత్రలో మళ్లీ నటించడం ఆనందంగా ఉంది. సీక్వెల్ చేస్తే సినిమా హిట్ అవుతుందా? లేదా? అని అందరిలోనూ కొన్ని అనుమానాలుంటాయి. కానీ జీతూ జోసెఫ్ మాత్రం మొదటి పార్ట్ కంటే అద్భుతంగా స్క్రిప్ట్ రాశారు. రాంబాబు ఇన్ని రకాలుగా ఆలోచిస్తాడా? అని జనాలు అనుకుంటారు. అంతా బాగుందని అనుకునే సమయంలో ఆరేళ్ల తరువాత ఇన్వెస్టిగేషన్ మొదలవ్వడం, మళ్లీ సమస్యలు రావడం.. సీటు అంచున కూర్చోబెట్టే సినిమాలు అంటారు కదా?..అలా ఉంటుంది సినిమా. ఏం జరిగిందనేది ఫ్యామిలీకి కూడా చెప్పడు. ఫ్యామిలినీ రక్షించడం మాత్రం తెలుసు. ఇది చాలా గొప్ప పాత్ర. మోహన్ లాల్ అద్భుతంగా నటించారు. రాంబాబు పాత్రలో మ‌రోసారి న‌టించ‌డం చాలా హ్యాపీ..

► దాదాపు ఒరిజినల్‌లానే ఉంటుంది. ఎక్కువ మార్పులు చేర్పులు చేయలేదు. కొత్తగా నాలుగైదు సీన్లు యాడ్ చేశాం. మొదటి పార్ట్ చూడకపోయినా దృశ్యం 2 అర్థమవుతంది. ఒకవేళ మొదటి పార్ట్ చూడాలని అనుకున్నా కూడా ఓటీటీలో అందుబాటులో ఉంది. సినిమా చేయడం వరకే నా బాధ్యత. విడుదల విషయంలో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వను. తప్పూ ఒప్పూ అని ఏమి ఉండదు. పరిస్థితులకు తగ్గట్టుగా వెళ్లిపోవాలి. ఇంకా చాలా సినిమాలు థియేటర్లో కూడా వస్తాయి. ఈ సినిమా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో చాలా త్వరగా షూటింగ్ పూర్తి చేశాం.

► సినిమాలు తీశామా? రిలీజ్ చేశామా? అంతే.. ఎంజాయ్ చేసే వాళ్లు ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. మనం ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించాలి. ఇలాంటి చిత్రాలు ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఎంత మంది చూస్తారు అని కాదు కానీ..ఈ బడ్జెట్‌కు ఓటీటీ బెస్ట్ అని నిర్మాతలు అనుకున్నారేమో. నా అభిమానులు కాస్త హర్ట్ అవుతారేమో కానీ.. నెక్ట్స్ సినిమాల‌తో థియేటర్లోకి వస్తాను అని వాళ్లకు తెలుసు. అన్నింటికి ఓపిగ్గా ఉండాలి. ఈ సారి ఇలా జరిగిందంతే. అందరూ కూర్చుని ఎంజాయ్ చేసే చిత్రాలను చేయబోతోన్నాను. కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నాను. నేను ఇలాంటి చిత్రాలే చేయలని అనుకోను. నా దగ్గరకు వచ్చిన సినిమాలు మాత్రమే నేను చేస్తాను.

► దృశ్యంకి మూడో పార్ట్ ఉంటుందో లేదో నాకు తెలీదు. అయితే ఈ సారి మాత్రం చాలా టైం పడుతుందని మాత్రం చెప్పారు. మూడు నాలుగేళ్లు పట్టొచ్చు. ఈ సారి తెల్లగడ్డంతో కనిపించినా ఆశ్యర్యపోవాల్సిన అవ‌స‌రం లేదు. నేను ఎప్పుడూ ఇమేజ్ గురించి ఆలోచించను. అదృష్టం కొద్దీ ఈ రంగంలోకి వచ్చాను. ప్రేక్షకుల అభిమానం దొరికింది. ఇంకా చూపిస్తూనే ఉన్నారు. కొత్తగా చేసేందుకు ట్రై చేసేందుకే ప్రయత్నిస్తున్నాను. నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను.

► ఓటీటీలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే బాధ ఎఫ్ 3తో పోతుంది. ఎఫ్ 3 డబ్బు చుట్టూ సినిమా తిరుగుతుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ అదే అవ‌స‌రం క‌దా..అందుకే త‌ప్పకుండా క‌నెక్ట్ అవుతుంది. దాదాపు షూటింగ్ పూర్తయింది. సమ్మర్‌లో సినిమా వచ్చే అవకాశాలున్నాయి. ఎక్కువగా ఏమీ ఆశించొద్దు. వచ్చిన దాన్ని స్వీకరించాలి. ఫీడ్ బ్యాక్ అనే దాంట్లో ప్లస్, మైనస్‌లుంటాయి. హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎక్కువగా రియాక్ట్ అవ్వకూడదు. కానీ ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని పాఠాలు నేర్చుకోవాలి. రిలీజ్ అయిన వెంటనే కాకుండా ఓ ఆరు నెలల తరువాత కూడా సినిమాలు చూస్తారు. బాగుందని అంటారు. ఓటీటీలోని అందం అదే. కొన్ని సినిమాలు వెంటనే చూస్తారు. కొన్ని మెల్లిగా చూస్తారు. థియేటర్లోంచి సినిమా వెళ్లి పోతుంద‌ని ముందు చూస్తారు. కానీ ఓటీటీలో తీరిగ్గా త‌ర్వాతైనా చూస్తారు.

► చాలామంది యువ దర్శకులు కథలు వినిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాకీ సంతకం చేయలేదు. ఖరారైన వెంటనే ఆ వివరాల్ని తెలియజేస్తా. ప్రస్తుతానికి రానాతో కలిసి ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ ప్రాజెక్టులో నటిస్తున్నా. అవకాశం వచ్చినప్పుడు దానికోసం 100 శాతం కష్టపడదాం. పని లేనప్పుడు ఖాళీగా హ్యాపీగా ఉందాం. ప్రపంచాన్ని చుట్టేద్దాం. అందరూ బాగుండాలని కోరుకుందాం. వీటికి మించింది ఏముంది?.. అనే ఆలోచనతో ముందుకు సాగుతుంటా అన్నారు వెంక‌టేశ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement