
ప్రసన్నకుమార్ బెజవాడ (Prasanna Kumar Bezawada) రాసిన ఎన్నో కథలు వెండితెరపై హిట్లు, సూపర్ హిట్లుగా నిలిచాయి. సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా.. ఇప్పుడు మజాకా చిత్రాలకు ప్రసన్నకుమార్ కథ అందించగా వాటిని నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేశాడు. ఇటీవలే వీరి కాంబినేషన్‌లో మజాకా మూవీ కూడా వచ్చింది. తన కెరీర్‌లో నాని, రవితేజ, నాగార్జున వంటి పెద్ద హీరోలతో పని చేసిన ప్రసన్నకుమార్ ఓసారి వెంకటేశ్ (Daggubati Venkatesh)తోనూ సినిమా చేయాలనుకున్నాడట!
కథ ఓకే అయింది కానీ..
ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. వెంకటేశ్‌గారికి గతంలో ఓ కథ పూర్తిగా వివరించి చెప్పాం. ఆయన సరేనని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. డేట్స్ చెప్పి షూటింగ్ మొదలుపెట్టేయండి అన్నారు. అయితే వెళ్లేముందు వాళ్ల అన్నయ్య సురేశ్‌బాబుకు కూడా కథ చెప్పమన్నారు. ఆయనతో రెండుమూడుసార్లు కూర్చున్నాం.. కథ వివరించాం.. ఆయనకేవో కొన్ని డౌట్స్ వస్తే వివరణ ఇచ్చాం. మాకు నమ్మకముందని చెప్పినా ఆయన వినిపించుకోలేదు.
సురేశ్‌బాబు వల్లే..
ఆయనకు తెలిసిన ఇద్దరుముగ్గురిని పిలిపిస్తాను. వారి అభిప్రాయం తెలుసుకున్నాక మాట్లాడదాం అన్నారు. ఎక్కడెక్కడి నుంచో ముగ్గురు వివిధ సమయాల్లో వచ్చారు. ఒక్కొక్కరికి సెపరేట్‌గా కథ చెప్పాను. ఆ ముగ్గురూ కథ బాగుందన్నారు. నాకు కథపై పట్టుందని, నన్ను డిస్టర్బ్ చేయకపోతే బెటర్ అని సురేశ్‌బాబు దగ్గరకు వెళ్లి చెప్పారు. కానీ సురేశ్‌బాబు నన్ను పిలిచి.. వేరేవాళ్ల నిర్ణయాలను పట్టించుకోను, తన నిర్ణయమే ఫైనల్ అన్నారు. అలాంటప్పుడు ఎందుకు వారికి కథ చెప్పడం అనిపించింది. అలా ఆయనకు నచ్చక సినిమా కుదర్లేదు అని చెప్పుకొచ్చాడు.