
హీరో విజయ్ తన రాజకీయ రంగప్రవేశానికి బాటను బలంగా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన తర్వాత లక్ష్యాన్ని ఛేదించాలి అనే దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఓ పక్క చిత్రాల్లో నటిస్తూనే మరోపక్క తన విజయ్ మక్కళ్ ఇయక్కుమ్ ద్వారా సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ఈ సంఘం ద్వారా ఇప్పటికే అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ఉచిత విద్య కేంద్రాలు, ఉచిత న్యాయ సలహా కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు.
ఇటీవల రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు చెందిన పదవ తరగతి, ప్లస్‌టూ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను ముగ్గురు చొప్పున తన కార్యాలయానికి రప్పించి వారికి ప్రశంసాపత్రాలను కానుకలను అందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ వారితో ముఖ్యంగా నోటుకు ఓటు విధానం సరికాదని, దీన్ని అందరూ పాటించాలని హితవు పలికారు.
ఇకపోతే తాజాగా ఉచిత వైద్య క్లినిక్ కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నగరాల్లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని విజయ్ మక్కళ్ ఇయక్కమ్ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ పేర్కొన్నారు. త్వరలోనే ఉచిత వైద్య క్లినిక్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment