Oscars 2023: India Proud As Rahul Sipligunj, Kaala Bhairava For Naatu Naatu Won The Oscar For Original Song At 95th Academy Awards - Sakshi
Sakshi News home page

ధూల్‌పేట్‌లో పుట్టి.. దుమ్ము లేపుతున్నాడు..  

Published Tue, Mar 14 2023 8:10 AM

India proud as Rahul Sipligunj Kaala Bhairava - Sakshi

తెలుగు సినీ చరిత్ర పుటల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ నాటు.. నాటు పాట నూతన అధ్యాయాన్ని లిఖించింది. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ పురస్కారానికి ఎంపికైహైదరాబాద్‌ మహా నగరం పేరును విశ్వ వ్యాప్తం చేసింది. సిటీకి చెందిన గాయకులు పాడిన పాటకు ఆస్కార్‌ అవార్డు దక్కడంతో నవయువ విజయాల భాగ్య ‘నగ’రి మణిహారంలో మరో ఆణిముత్యం జత చేరింది. టాలీవుడ్‌ రాజధానిగా.. సినిమాల తయారీకి చిరునామాగా ఉన్న నగర ఖ్యాతిని ఇనుమడింపజేస్తూ ఆస్కార్‌ పురస్కారం వరించడం సిటిజనులకు గర్వకారణంగా మారింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా రూపకర్తలు, కథా నాయకులు, నృత్య దర్శకుడు... అందరూ మన సిటిజనులే కాగా నాటు నాటు పాడిన ఇద్దరు యువ గాయకులు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌  ఇక్కడే పుట్టి పెరిగిన వారు కావడంతో సంతోషం ద్విగుణీకృతమైంది. 

ధూల్‌పేట్‌లో పుట్టి.. దుమ్ము లేపుతున్నాడు..  
నగరంలోని ధూల్‌పేట్‌కు చెందిన ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి.. ఖండాంతర ఖ్యాతి సొంతం చేసుకున్నాడు రాహుల్‌ సిప్లిగంజ్‌. ఇంట్లోని గిన్నెలు, స్టీలు ప్లేట్ల మీద దరువేసిన నాటి అల్లరి కుర్రోడు ఆస్కార్‌ ను ఇంటికి తెచ్చేసుకున్నాడు.  నిన్నా మొన్నటి దాకా మన మధ్యనే ఆడి పాడిన రాహుల్‌ సిప్లిగంజ్‌ అంతర్జాతీయ స్థాయిలో సినీ ప్రముఖుల మధ్య పాడి ఆడించాడు.  

చిన్నవయసులో గజల్‌ మాస్టర్‌ దగ్గర కొన్నాళ్లు శిష్యరికం చేసిన రాహుల్‌.. మరోవైపు తండ్రికి సహాయంగా బార్బర్‌ షాప్‌లో పని చేశాడు. ఏడేళ్ల శిక్షణలో గజల్స్‌పై పట్టు సాధించాడు. ఆ సమయంలోనే సినిమాల్లో కోరస్‌గా అలా అలా నాగ చైతన్య తొలి చిత్రం జోష్‌లో ‘కాలేజీ బుల్లోడా’  పాటతో 
అవకాశం వచ్చింది.  

ఆ తర్వాత తను పాడిన పాటల సీడీని తీసుకు వెళ్లి మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణికి వినిపించి, ఆయన సంగీత దర్శకత్వంలో ‘వాస్తు బాగుందే’ అనే పాడే అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత ‘ఈగ’లో టైటిల్‌ సాంగ్, రచ్చ’లో సింగరేణి ఉంది... బొగ్గే పండింది, ‘రంగస్థలం’లో రంగా రంగా రంగస్థలానా,‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో బోనాలు.. వంటి వరుస హిట్‌ సాంగ్స్‌తో స్టార్‌ సింగర్‌గా ఎదిగిపోయాడు. ఓ వైపు గాయకుడిగా రాణిస్తూనే మరోవైపు ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ కూడా స్వయంగా రూపొందిస్తూ.. మంగమ్మ, పూర్‌ బాయ్, మాకీ కిరికిరి’, ’గల్లీకా గణేష్’, ’దావత్‌’.. ఇలా నగర సంస్కృతీ సంప్రదాయాలకు తనదైన గానాన్ని జతచేసి సక్సెస్‌ సాధించాడు. గత 2019లో  బిగ్‌బాస్‌ సీజ న్‌–3లో గెలిచి మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.  

కాలభైరవ.. గాన వైభవ.. 
ప్రముఖ సంగీత దర్శకుడు, నాటు నాటు పాటకు స్వరాలద్దిన కీరవాణి తనయుడు కాలభైరవ.. గత కొంత కాలంగా గాయకుడిగా రాణిస్తున్నాడు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో పాడుతున్నాడు. గాయకుడిగానే కాకుండా మత్తు వదలరా, కలర్‌ ఫొటో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి సత్తా చాటాడు. బాహుబలి 2లో దండాలయ్యా...పాటతో సూపర్‌ హిట్‌ కొట్టాడు. నాటు నాటు పాటలో సహ గాయకుడు రాహుల్‌తో కలిసి స్వరం కలిపి ఏకంగా ఆస్కార్‌నే అందుకున్నాడు.   

కాలభైరవ,రాహుల్‌ సిప్లిగంజ్‌ సిటీ కుర్రాళ్లే 

విశ్వ సినీ చరిత్రలో మన నగరానికి ఖండాంతర ఖ్యాతి

ఇరువురు గాయకులపై అభినందనల వెల్లువ    

Advertisement
Advertisement