హిందీలో నటిగా నిరూపించుకున్న జాన్వీ కపూర్ ఇప్పుడు తెలుగులోనూ సత్తా చాటాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు జాన్వీ కపూర్. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌లో ఆల్రెడీ పాల్గొన్నారు జాన్వీ. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగం ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది. కాగా ‘దేవర’ చిత్రం తొలి భాగం విడుదల కాకముందే తెలుగులో మరో పెద్ద సినిమాకు జాన్వీ కపూర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
రామ్‌చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు సన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ వేసవిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు జాన్వీ కపూర్ ఫైనలైజ్ అయ్యారని తాజా సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెల్లడి కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. అలాగే అఖిల్ హీరోగా నటించనున్న కొత్త సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ పేరు వినిపిస్తోంది. ఇలా వరుస సినిమాలతో జాన్వీ తెలుగులో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment